Kodali Nani అడ్డాలో చంద్రబాబు పర్యటన.. ఏం జరుగుతుందో?
vijayawada: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(ex cm chandrababu naidu) మూడు రోజుల పర్యటనలో భాగంగా కృష్ణా జిల్లా(krishna district)లో నిన్నటి నుంచి పర్యటిస్తున్నారు. ఇక ఇవాళ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని(mla kodali nani) ఇలాకాలో చంద్రబాబు అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు కానీ, లోకేష్(lokesh) గానీ కొడాలి నాని పేరు ప్రస్తావిస్తూ పెద్దగా వ్యాఖ్యలు చేయలేదు. అయితే ఈ సారి నేరుగా చంద్రబాబు గుడివాడకు వచ్చి మాట్లాడుతున్న నేపథ్యంలో నానిపై ఎలాంటి విమర్శలు, ఆరోపణలు చేస్తారు అన్నదానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే చంద్రబాబు గుడివాడ పర్యటన నేపథ్యంలో భాగంగా.. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా అప్రమత్తమయ్యారు.
ఇప్పటికే గుడివాడ, గన్నవరంపై ఫోకస్..
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు, లోకేష్‌లపై వ్యక్తిగతంగా, రాజకీయంగా తీవ్రమైన విమర్శలు చేయడంలో ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ(vallabhaneni vamsi) ముందు వరుసలో ఉన్నారు. అంతేకాకుండా వీరు వంశీ టీడీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచి.. ఇప్పుడు వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. నాని కూడా గతంలో టీడీపీ తరపునే ఎమ్మెల్యేగా మారారు. అయినా కూడా చంద్రబాబుపై వీరు ముందునుంచే దూకుడు వైఖరి ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఈనేపథ్యంలో ఎలాగైనా రానున్న ఎన్నికల్లో వంశీ, నానిలను ఓడించాలని టీడీపీ క్యాడర్ బలంగా భావిస్తోంది. ఈక్రమంలో చంద్రబాబు ఈ అంశంపై ఏం మాట్లాడతారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబు నిమ్మకూరులో ఎన్టీఆర్ శత జయంతి సభలో పాల్గొంటారు. అక్కడ నుంచి బస్ స్టాండ్ సెంటర్, నెహ్రూ చౌక్, గుడివాడ బైపాస్ మీదుగా చంద్రబాబు రోడ్ షో సాగుతుంది. గుడివాడలో చంద్రబాబు పాదయాత్ర చేస్తారు. బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. నిన్న చంద్రబాబుకు స్వాగతం చెప్పే ర్యాలీలో ఎన్టీఆర్ అభిమానులు హడావుడి చేశారు.