Chandrababu Naidu: పోలవరం ప్రాజెక్ట్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేసారు. 2027 నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి తీరతామని ప్రకటించారు. తనకెంతో ఇష్టమైన ఈ జాతీయ ప్రాజెక్ట్‌కు అన్ని రూపకల్పనలు చేసి.. కేంద్రం పెద్దలతో కొట్లాడి.. తానే ఓ సుప్రీంకోర్టు లాయర్‌గా అన్నీ వాదించి మరీ నిధులు సాధించుకుంటే.. 2019లో ఆ ప్రాజెక్ట్‌కి శని పట్టుకుందని జగన్‌పై మండిపడ్డారు.
అంత పెద్ద ప్రాజెక్ట్‌ను జగన్ పట్టించుకోకపోగా పనులన్నీ శాశ్వతంగా ఆగిపోయేలా చేసాడని అన్నారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వచ్చాయని.. కేంద్రంతో పోలవరానికి సంబంధించిన చర్చలు సఫలమవడంతో 2027 మార్చి నాటికి పూర్తి చేసి తీరతామని వెల్లడించారు. ప్రాజెక్ట్‌ను సర్వనాశనం చేసిందే కాకుండా ఇంకా తామే ఏదో ఉద్ధరించాం అన్నట్లు మాట్లాడే వీరిని కొన్ని దేశాల్లో అయితే అసలు సహించరని.. కానీ ఇది భారతదేశం కాబట్టి వారి కుట్రపూరిత మాటలకు హద్దు లేకుండాపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసారు.
“” ముంపు మండలాలు ఇవ్వకుండా పోలవరం ప్రాజెక్టు వద్దని ఆరోజే చెప్పాను. ఆ ఏడు మండలాలు ఇస్తేనే ప్రమాణం చేస్తానని చెప్పా. అది నా దూరదృష్టి. పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,157 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. పోలవరం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు. ఈ ఐదేళ్లు జగన్ చేసిన నిర్లక్ష్యానికి పోలవరం చుట్టూ కంపలు పెరిగిపోయాయి. కంపలు కొట్టించడానికి అయిన ఖర్చు రూ.35 కోట్లు. బాధ్యత లేని పొగరుతో వ్యవహరించే వ్యక్తి రాష్ట్రానికి సీఎం అయితే ఎంత నష్టం జరుగుతుందో ప్రజలు కూడా అర్థం చేసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి కూడా రాలేరు. ఎమ్మెల్యేగానే కాదు ఎక్కడ కూడా ఉండేందుకు అర్హత లేదు “” అని తెలిపారు.