మహిళలకు పవన్, చంద్రబాబు శుభాకాంక్షలు!
భారతీయ సంస్కృతిలో మహిళలకు ఎంతో గొప్ప స్థానం ఉందని.. ఒక తల్లిగా, ఒక సోదరిగా, ఒక భార్యగా, ఒక స్నేహితురాలిగా మహిళలు పురుషుల జీవితంలో ఎంతో గొప్ప పాత్రను పోషిస్తున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. వాడవాడలా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని.. చట్టసభల్లో, అన్నిచోట్ల మహిళలకి 33 శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మేరకు ట్వీట్ చేశారు. మహిళా రిజర్వేషన్ల అంశాన్ని తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచిందని.. మహిళల రిజర్వేషన్లు సాధించే విషయంలో తన ప్రయత్నం చిత్తశుద్ధితో కొనసాగుతుందన్నారు. స్త్రీ సంపూర్ణ సాధికారిత సాధించడానికి, వారు స్వేచ్ఛగా జీవించడానికి మన సమాజం, ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరగని సమాజం ఆవిష్కృతం కావడానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. సృష్టిలో సగభాగం అయిన మహిళ, ప్రతి మనిషి జీవితంలో కీలకపాత్ర పోషించే ఆడపడుచులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంపూర్ణ స్త్రీ సాధికారత సాధించాలని ఆకాంక్షిస్తున్నాం అంటూ ట్వీట్ చేశారు పవన్.
చంద్రబాబు ఏమన్నారంటే..
ఎక్కడైతే స్త్రీ గౌరవం పొందుతుందో అక్కడే సకల దేవతలు కొలువై ఉంటారని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ముందుగా మహిళలకు ఉమెన్స్‌డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ మహిళ నేతలు, కార్యకర్తలు అభిమానులలో ఆయన వీడియో సమావేశం ఏర్పాటు చేశారు. మహిళలు తమ జీవితాన్ని తమ కుటుంబం కోసం, సమాజం కోసం అంకితం ఇస్తున్నారని చంద్రబాబు తెలిపారు. అలాంటి స్త్రీమూర్తులందరినీ గౌరవించుకునేలా మహిళా దినోత్సవం జరుపుకోవాలి టీడీపీ అధినేత పిలుపునిచ్చారు.