BJP: ప్ర‌త్యేక హోదా ఇచ్చి ఒంట‌రిగా పోటీ చేయ‌కూడ‌దా?

BJP: భార‌తీయ జ‌న‌తా పార్టీనే మ‌ళ్లీ కేంద్రంలో అధికారంలోకి వ‌స్తుంద‌ని చాలా స‌ర్వేలు చెప్తున్నాయి. కాంగ్రెస్ కిందా మీదా ప‌డి త‌న ప్ర‌య‌త్నాలు తాను చేస్తోంది. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు (AP Elections), లోక్ స‌భ ఎన్నిక‌లు (Lok Sabha Elections) ఒకేసారి జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో భార‌తీయ జన‌తా పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ఎంపీ స్థానాల‌ను ద‌క్కించుకోవాల‌ని అనుకుంటోంది. మ‌రోప‌క్క కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని అనుకుంటోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ… తెలుగు దేశం (Telugu Desam Party), జ‌న‌సేన (Janasena) పార్టీల‌తో పొత్తు పెట్టుకుని బ‌రిలోకి దిగ‌నున్న సంగ‌తి తెలిసిందే. అసెంబ్లీ స్థానాలు గెలిచినా.. గెల‌వ‌క‌పోయినా పార్ల‌మెంట్ స్థానాల‌ను మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లో గెలిచేలా ప్ర‌ణాళికలు రచిస్తోంది. అందుకే పాపం జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌కున్న ఎంపీ స్థానాల్లో ఒక స్థానాన్ని త్యాగం చేసారు.

భారతీయ జ‌న‌తా పార్టీకి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒక శాతం ఓటు మాత్ర‌మే ఉంది. ముందు 175 స్థానాల్లో ఒంట‌రిగా పోటీ చేయాల‌నుకున్న క‌మ‌లం పార్టీ.. లోక్ స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో రిస్క్ ఎందుకని పొత్తుకు పోయింది. నిజానికి గ‌తంలో వెన్నుపోటు పొడిచిన చంద్ర‌బాబు నాయుడితో మ‌ళ్లీ పొత్తు పెట్టుకునేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఏమాత్రం ఇష్టం లేదు, కానీ ఎంపీ స్థానాలు గెలిచి మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే అప్పుడు చంద్ర‌బాబు తోక జాడించినా క‌ట్ చేయొచ్చు అని భావించింది.

ALSO READ: AP Elections: ప్ర‌త్యేక హోదా ప‌రిస్థితేంటి? ఎవ‌రు తెస్తారు?

ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఏపీ ప్ర‌జ‌లు ఏ పార్టీ ప్ర‌త్యేక హోదా ఇస్తే ఆ పార్టీకి ఓటేసే యోచ‌న‌లో ఉన్నారు. ఆ ప్ర‌త్యేక హోదా ఇచ్చే హ‌క్కు కేంద్ర ప్ర‌భుత్వానికే ఉంది. ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వంలో అధికారంలో ఉంది భార‌తీయ జ‌న‌తా పార్టీనే కాబ‌ట్టి.. ప్రత్యేక హోదా ఇస్తాం అని ప్ర‌క‌టించి 175 స్థానాల్లో పోటీ చేసి ఉంటే గెలిచే అవ‌కాశం ఉందేమో అనే టాక్ వినిపిస్తోంది. అప్పుడు అసెంబ్లీ సీట్లు, ఎంపీ సీట్లు కూడా భారతీయ జ‌న‌తా పార్టీకే ప‌డ‌తాయి. మ‌రో విష‌యం ఏంటంటే.. భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఓ సెంటిమెంట్ ఉంది. ఏ రాష్ట్రంలో అయితే రెండు ప్రాంతీయ పార్టీలు పొత్తు పెట్టుకుని ఉంటాయో.. ఆ రాష్ట్రాల్లో భార‌తీయ జ‌నతా పార్టీ అధికారంలోకి రాలేదు. ఎప్పుడైతే పొత్తులు వీడ‌తాయో అప్పుడే ఆ రాష్ట్రంలో క‌మ‌ల ద‌ళం అధికారంలోకి వ‌స్తుంది.

కానీ ప్ర‌త్యేక హోదా ఇవ్వాలంటే చాలా ప్ర‌క్రియ‌ల‌తో కూడుకున్న పని. ఈ స‌మ‌యంలో అయితే ఏపీకి ప్ర‌త్యేక హోదా రాదు. ఇచ్చే ప‌రిస్థితి BJPకి కూడా లేదు. అందుకే మౌనంగా ఇచ్చిన సీట్ల‌లో పోటీ చేసుకుని ఎంపీ స్థానాల్లో గెలవాల‌న్న ఆలోచ‌న‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఉంది.