Buggana: అదే జరిగితే జగన్ రాజీనామా చేస్తానన్నారు
Buggana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అన్నీ తప్పుడు లెక్కలు చూపించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. చంద్రబాబు చెప్పేవన్నీ నిజమైన లెక్కలు అయితే ఎందుకని ఈ ఏడాదికి బడ్జెట్ ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెడితే అప్పు ఎంతుందో అసలు విషయాలు బయటికి వస్తాయని చివరికి గవర్నర్‌తోనూ అబద్ధాలు చెప్పించారని ఆరోపించారు.
“” చంద్రబాబు గారూ.. ఇన్ని అబద్ధాలా? ఆరోపణలు చేయడానికి కూడా ఓ హద్దు ఉంటుందండీ. కోవిడ్ సమయంలో విమానాలు ఎక్కడానికి ప్రజలు వణికిపోతున్న సమయంలో నేను ఆర్థిక మంత్రిగా నా అధికార యంత్రాంగంతో కలిసి కొన్ని వందల సార్లు విమానం ఎక్కి ప్రయాణించాను. ఎందుకంటే మా అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ఇవ్వాలనుకున్న పథకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చి తీరాలని చెప్పారు. ఒక పథకం విషయంలో ఇది సాధ్యమా అని ఆలోచిస్తున్న సమయంలో జగన్ మాతో ఓ మాటన్నారు. ఇది నేను పేద ప్రజలకు ఇవ్వాలనుకున్న పథకం. ఇది సాధ్యం కాకపోతే నేను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతా అన్నారు. అది విని మేం షాకయ్యాం. అలా జరగకూడదు అని చెప్పి ఆ పథకం కోసం రాత్రింబవళ్లు ఎంత కష్టపడ్డామో మాకు తెలుసండీ. ఈరోజు మీరు అధికారంలో ఉన్నంత మాత్రాన అన్ని అబద్ధాలు ఎలా ఆడతారు? “” అని మండిపడ్డారు బుగ్గన