Buddha Venkanna: కష్టపడ్డాను.. TDP నాకు న్యాయం చేయాలి
Buddha Venkanna: అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చాక తనను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఓ అనాథలా మిగిలిపోయానని అన్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ఎన్నికల్లో తనకు సీటు వస్తుందని ఆశించానని.. కానీ భారతీయ జనతా పార్టీ నేత సుజనా చౌదరికి సీటు ఇస్తే తాను ఏమీ అనకుండా అతని కోసం ప్రచారం చేసానని అన్నారు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చినా తన నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నానని.. ప్రతిదానికీ ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాల్సి వస్తోందని అన్నారు. పోలీస్ అధికారులను బదిలీ చేద్దామనుకున్నా కానీ సుజనా చౌదరి తనకు కావాల్సిన వారిని బదిలీ చేసుకున్నారని తెలిపారు.
చంద్రబాబు నాయుడు ఇంటిపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు దాడి చేసినప్పుడు తాను ప్రతిఘటించానని.. తనపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా తట్టుకున్నానని అన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు పోస్టర్‌పై తన రక్తంతో అభిషేకం చేసానని.. ఆరోజు తనకు మద్దతుగా ఎవ్వరూ రాలేదని అన్నారు. పార్టీ నుంచి తాను ఏమీ ఆశించడంలేదని.. కనీసం ఇంతగా పార్టీ కోసం కష్టపడినందుకు తనకు కనీస న్యాయం చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. తన ఊపిరి ఉన్నంత వరకు తెలుగు దేశం పార్టీలోనే ఉంటానని చెప్పారు.