GHMCలో BRS ఖేల్ ఖతం?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారంలోకి వచ్చింది భారత రాష్ట్ర సమితి (BRS). మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడుతుందనుకుంటే.. షాకింగ్‌గా అతి స్వల్ప సీట్లు మాత్రమే రాబట్టుకుంది. దాంతో విజయం కాంగ్రెస్‌కు దక్కింది. ఈసారి త్వరలో జరగబోతున్న లోక్ సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని తీవ్రంగా కృషి చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్‌లో BRS పట్టు సాధించింది.
ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో ఆ పట్టును కూడా కోల్పోనున్నట్లు తెలుస్తోంది. మెల్లిగా భారత రాష్ట్ర సమితిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలను తన వైపుకు లాక్కుంటున్న కాంగ్రెస్.. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌ను క్లీన్ స్వీప్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న నాలుగు ఎంపీ సీట్లను కైవసం చేసుకోవాలని అనుకుంటోంది.
ప్రస్తుత హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇటీవల భారత రాష్ట్ర సమితి నుంచి తన తండ్రి కేశవరావుతో పాటు కాంగ్రెస్‌లో చేరారు. దాంతో హైదరాబాద్‌లో ముఖ్య నేత మిస్సయిపోయారు. మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లిపోవడంతో హైదరాబాద్‌లో భారత రాష్ట్ర సమితి వీక్ అయిపోయింది. 2020 గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో దాదాపు 8 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు. దాంతో కాంగ్రెస్ వద్ద ఇప్పుడు 10 మంది ఉన్నారు. త్వరలో మరో 15 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది.
ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించాలని అనుకుంటున్నారు. ఎమ్మెల్యేలు వెళ్తే ఆటోమేటిక్‌గా కార్పొరేటర్లు వస్తారని ఆయన ప్లాన్ వేసారు. ఈ రకంగా చూసుకుంటే కాంగ్రెస్‌కు హైదరాబాద్‌లో బేస్ పెరుగుతోంది. ఈసారి భారత రాష్ట్ర సమితికి లోక్ సభ ఎన్నికల్లో కూడా గెలవడం కష్టమే అని చెప్పాలి.