Telangana: “ఒత్తిడి వల్లే BRS అని పెట్టాం”
Telangana: తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పేరుతో పార్టీని స్థాపించిన తెలంగాణ మాజీ సీఎం KCR.. ఈ ఏడాదిలో తెలంగాణ ఎన్నికలకు కొన్ని నెలల ముందు పార్టీని భారత రాష్ట్ర సమితిగా (BRS) మార్చి జాతీయ పార్టీగా ప్రకటించారు. ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం ఇది కూడా ఒకటి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న KCR.. తన పార్టీలో తెలంగాణ పేరును లేకుండా చేయడం వల్లే దాదాపు 2 శాతం ఓట్లపై ఎఫెక్ట్ పడిందట. ఈ విషయాన్ని పార్టీ కార్యకర్తలు నేతల దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితిగానే ఉంచాలని అప్పుడే పార్టీకి కలిసొస్తుందని వారు తమ అభిప్రాయాన్ని నేతల ముందు ఉంచారు. దీని గురించి KCRతో చర్చిస్తామని నేతలు హామీ ఇచ్చారు.
ఒత్తిడి వల్లే BRS అని పెట్టాం
అయితే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితి అని పేరు ఎందుకు మార్చారు అనే అంశంపై స్పందించారు పార్టీ స్టేట్ సెక్రటరి లింగంపల్లి కిషన్ రావు. తెలంగాణలో KCR ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి భారతదేశ వ్యాప్తంగా ఉన్న రైతులు, పేద ప్రజలు కూడా తమకు ఇలాంటి పాలన కావాలని కోరుకోవడం వల్లే భారత రాష్ట్ర సమితిగా మార్చాలన్న ఒత్తిడి తమపై పడిందని తెలిపారు. పార్టీ పేరు మార్చడం వల్ల తాము ఎన్నికల్లో ఓడిపోలేదని.. కాంగ్రెస్ భూటకపు హామీలను ప్రజలు గుడ్డిగా నమ్మి వారికి ఓటు వేసారని తెలిపారు.