KCRకు భారీ షాక్.. TDP గూటికి BRS ఎమ్మెల్యేలు?
KCR: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో అడుగుపెట్టగానే.. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు తెలుగు దేశం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడిని కలిసి అభినందనలు తెలిపేందుకు కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ఇతర నేతలు వెళ్లారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే తెలంగాణలోనూ తెలుగు దేశం పార్టీకి పూర్వ వైభవం తెస్తానని అన్నారో అప్పటి నుంచి BRS నేతల్లో కొత్త ఆశలు చిగురించాయట.
నిజానికి గ్రేటర్‌లోని ఎమ్మెల్యేలంతా గతంలో తెలుగు దేశం పార్టీ కోసం పనిచేసిన వారే. అంతేకాదు.. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ సెట్లర్ల ఓట్లతోనూ విజయం సాధించారన్న టాక్ ఉంది. గతంలో పార్టీని వీడిన వారు మళ్లీ TDPకే రావడానికి ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి మల్లారెడ్డి TDPలో చేరి పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవి చేపడతారన్న టాక్ వినిపించింది. ఈ తరుణంలో BRS ఎమ్మెల్యేలు చంద్రబాబును కలవడం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. బాబును కలిసిన ఎమ్మెల్యేలు మాత్రం శుభాకాంక్షలు చెప్పడానికి మాత్రమే కలిసామని అంటున్నారు.