TDP BJP: పొత్తు ఏపీలో.. తెలంగాణ‌లో కాదు.. తేల్చి చెప్పిన బీజేపీ

TDP BJP: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో తెలుగు దేశం, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీలు క‌లిసి బ‌రిలోకి దిగ‌నున్న సంగ‌తి తెలిసిందే. సీట్ల షేరింగ్ ప్ర‌క్రియ కూడా ముగిసింది. అయితే ఇదే అద‌నుగా తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) తెలంగాణలోనూ భార‌తీయ జ‌న‌తా పార్టీతో (Bharatiya Janata Party) పొత్తు పెట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లోని ఖ‌మ్మం సీటును త‌మ‌కు ఇవ్వాల‌ని తెలుగు దేశం.. భార‌తీయ జ‌న‌తా పార్టీని అడిగింది. ఇందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ హైక‌మాండ్ అస్స‌లు ఒప్పుకోలేదు.

తెలంగాణ‌లో ఎలాంటి పొత్తు లేద‌ని.. అస‌లు తెలుగు దేశం పార్టీ తెలంగాణ‌లో ఎంపీ స్థానాల్లో పోటీ చేయ‌డం త‌మ‌కు ఏమాత్రం ఇష్టం లేద‌ని తెలంగాణ భారతీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డి (Kishan Reddy) తేల్చి చెప్పారు. తెలంగాణ‌లో మాత్రం తాము ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని అంటున్నారు. ఇప్ప‌టికే 17 ఎంపీ సీట్ల‌కు గానూ 15 సీట్ల‌ను తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో ఖ‌మ్మం టికెట్ ఆశిస్తూ జ‌ల‌గం వెంక‌ట్రావు భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరారు.