Elections: అభ్యర్థుల ఎంపికలో గుజరాత్ వ్యూహమా!
Bengaluru: కర్నాటక ఎన్నికల(karnataka elections)ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార బీజేపీ(bjp).. ఆ రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు నానా తంటాలు పడుతోంది. ఈక్రమంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను రెండు జాబితాల్లో విడుదల చేసింది. వివిధ సర్వేలు, అవినీతి ఆరోపణలు, తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని అనేకమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, సీనియర్లకు ఈ సారి బీజేపీ సీట్లు కేటాయించలేదు. దీనిపై ఆ పార్టీలో అసమ్మతి స్వరాలు భగ్గుమన్నాయి. అయినప్పటికీ బీజేపీ ఓ వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నష్టనివారణ చర్యల్లో భాగంగా బీజేపీ దాదాపు 59 మంది కొత్తవారికి ఈ సారి సీట్లను కేటాయించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
తొలి జాబితాలో బీజేపీ అధిష్టానం 189 మందిని ప్రకటించగా.. నిన్న రెండో జాబితాలో 23 మందికి సీట్లను కేటాయించింది. తొలి జాబితాలో 52 మంది కొత్తవారికి అవకాశం ఇవ్వగా.. రెండో లిస్టులో మరో ఏడుగురికి అవకాశం ఇచ్చారు. దీంతో మొత్తం 59 మంది కొత్తవారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది. ఇక ఇదే విధానాన్ని గతంలో జరిగిన గుజరాత్(gujarath) ఎన్నికల్లో బీజేపీ అవలంబించి విజయం సొంతం చేసుకుంది. ఇక ఇదే ఫార్ములాని కర్నాటకలో కూడా అమలు చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అన్ని వర్గాల వారికి సమ ప్రాధాన్యం కల్పిస్తున్నారు కమలనాథులు. తొలి జాబితాలో విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, బెంగళూరు నగర మాజీ పోలీస్ కమిషనర్ భాస్కరరావుతోపాటు ఎనిమిది మంది మహిళలు, 9 మంది వైద్యులు, అయిదుగురు లాయర్లు, ఒక రిటైర్డ్ ఐపీఎస్, ముగ్గురు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఎనిమిది మంది సామాజిక కార్యకర్తలకు టికెట్లు ఇచ్చామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్(arun singh) తెలిపారు. ఇక కర్నాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప(bs yediyurappa) కుమారుడు బీవై విజయేంద్ర(vijayendhra)కు టికెట్ ఇచ్చారు.