TDP BJP Janasena: అయ్యా ఒగ్గేయండయ్యా…!
TDP BJP Janasena: తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా ఇప్పటికే పది అసెంబ్లీ సీట్లు దక్కించుకున్న భారతీయ జనతా పార్టీ.. ఇప్పుడు పదకొండో సీటుపై కన్నేసింది. గట్టిగా పోటీ చేసి డిపాజిట్లు కూడా తెచ్చుకునే గట్టి లీడర్లు కూడా లేని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఏకంగా ఆరు ఎంపీ, పది అసెంబ్లీ సీట్లు దక్కించుకుంది.
ఇది చాలదన్నట్లు ఇప్పుడు పదకొండో సీటు లాక్కోవాలని చూస్తోంది. మరి ఇప్పుడు ఆ పదకొండో సీటు ఎవరిస్తారు? ఇప్పటికే పాపం జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ భవిష్యత్తు.. రాష్ట్రం బాగుపడితే చాలు అనుకుంటూ అడిగినన్ని సీట్లు త్యాగం చేస్తున్నారు. మరోపక్క ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగు దేశం పార్టీ ఇంకో సీటు అడిగితే మూతి పగలగొట్టేలా ఉంది. మరి ఇప్పుడు ఆ పదకొండో సీటును మళ్లీ జనసేనే త్యాగం చేయాలా?
భారతీయ జనతా పార్టీకి చెందిన ఎన్నికల ఇన్‌ఛార్జి అరుణ్ సింగ్ ఈరోజు విజయవాడలో సమావేశం ఏర్పాటుచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 11 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని అన్నారు. అదేంటి.. పదే కదా ఈ పదకొండో సీటు ఎక్కడి నుంచి వచ్చిందని తెలుగు దేశం, జనసేన పార్టీలు తలబాదుకుంటున్నాయి. రాజంపేట లేదా తంబళ్లపల్లె సీట్ల నుంచి ఏదో ఒకటి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చివరికి పాపం జనసేననే బలి చేసేలా ఉన్నారని టాక్.
చివరికి జనసేన, తెలుగు దేశం నేతల పరిస్థితి ఎలా ఉందంటే.. అయ్యా ఒగ్గేయండయ్యా.. ఈ సీట్ల పంచాయితీ ఆపి ఇక ప్రచారం మొదలుపెట్టుకుందాం అని లోలోపల వేడుకుంటున్నట్లుగా అయిపోయింది.