AP Elections: TDPకి జగన్ ఝలక్..!
AP Elections: తెలుగు దేశం పార్టీకి (Telugu Desam Party) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ఝలక్ ఇచ్చారు. మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు (AP Elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బరిలోకి దిగనున్న పార్టీలన్నీ క్షేత్రస్థాయిలో ప్రచారాలు చేసుకుంటున్నాయి. ఎన్ని ప్రచారాలు చేసినా చివరికి ప్రజలు ఏ పార్టీకి ఓటేస్తే వారే అధికారంలోకి వస్తారు. ప్రజలు ఓటెయ్యాలంటే వారికి పార్టీ ఇచ్చే హామీలు నచ్చాలి. దీనిని దృష్టిలో పెట్టుకునే 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల పేరిట హామీలు ప్రకటించారు. ఈ నవరత్నాలే జగన్కు అధికారాన్ని కట్టబెట్టాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
మరి ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి సీటును అధిష్ఠించేందుకు జగన్ చేయని ప్రయత్నాలు లేవు. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే.. రైతులకు రుణమాఫీ. ఆంధ్రప్రదేశ్ రైతాంగ ఓట్లు తనకు పడేలా జగన్ రుణ మాఫీ పథకాన్ని ఇప్పుడే అమలు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే జరిగితే తెలుగు దేశం పార్టీ గెలిచే ఛాన్సులు పడిపోయే అవకాశం ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఎన్నికల సమయంలో అధికారంలోకి రావాలని పార్టీలు ఎన్నో హామీలను ప్రకటించేస్తూ ఉంటాయి. వాటికి అయ్యే బడ్జెట్ ఎంత అనేది కూడా ఆలోచించరు. ముందు అధికారంలోకి వచ్చాక అప్పుడు చూసుకుంటాం అనుకుంటారు.
అలాగని ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయడం ఎవరి వల్ల కాదు. అదే విధంగా 2019 ఎన్నికల సమయంలో వైసీపీ ప్రకటించిన కొన్ని హామీలు అమలు చేసి ఉండకపోవచ్చు. కానీ ఇచ్చిన హామీల్లో 70-80% హామీలు నెరవేర్చారని గ్రామాల్లో ఉండే ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయం అయితే వైసీపీపై ఏర్పడింది. కానీ చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) విషయంలో ఈ నమ్మకమే ప్రజలకి లేదు. ఇందుకు కారణం ఆయన 2014 ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోను అమలు చేయడంలో విఫలమయ్యారన్న టాక్ గట్టిగా ఉంది. అంతేకాదు తెలుగు దేశం పార్టీ మేనిఫెస్టోలో పార్టీకి సంబంధించిన అధికారిక వెబ్సైట్ నుంచి తొలగించేసారు. ఆయన ఇచ్చిన హామీలు 25% కూడా నెరవేర్చినట్టు చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్రలో లేదు.
చంద్రబాబుకు రైతు పోటు తప్పదా?
ఇప్పుడు జగన్ కనుక రైతు రుణమాఫీ ప్రకటిస్తే మాత్రం తెలుగు దేశం పార్టీ గట్టి దెబ్బ పడినట్టే. ఆ తరువాత చంద్రబాబు నాయుడు అంతకన్నా డబుల్ రుణమాఫీ నేను చేస్తానని అన్నా ప్రజలు ఆయన్ని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే 2019 ఎన్నికల్లో ప్రజలు జగన్ మోహన్ రెడ్డిని గెలిపించుకున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి చాలానే చెప్తారని తీరా అధికారం చేతికిస్తే విజన్ విజన్ అంటూ పేద ప్రజలను పట్టించుకోడన్న టాక్ కూడా ఉంది. కానీ చంద్రబాబు నాయుడికి ఉన్న 40 ఏళ్ల రాజకీయ పట్టుని కూడా అభినందించాల్సిందే. చంద్రబాబు నాయుడు ముందు వెనకా ఆలోచించకుండా హామీలు ఇచ్చేసే రకం కాదు. ఏది ప్రజలకు ఇస్తే మంచిదో ఏవి ఇవ్వకూడదో ఆయనకు తెలుసు.
ఉచిత బస్సు ప్రయాణం
రుణ మాఫీ అనే కాదు. కొన్ని రోజుల క్రితం తెలుగు దేశం పార్టీ ప్రచారంలో భాగంగా నారా లోకేష్ (Nara Lokesh) ప్రజలకు ఒక పథకం గురించి ముందే ప్రకటించేసారు. ఆంధ్రప్రదేశ్లో కూడా తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో మాదిరిగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని ప్రకటించారు. దాంతో జగన్ మోహన్ రెడ్డి అలెర్ట్ అయిపోయారు. అధికారంలోకి వచ్చాక కాదు ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని తాను అమలు చేస్తానని అన్నారు. మరి దీని సంగతి ఏమైందో వారికే తెలియాలి.