avinash reddy: హత్య గురించి బాబాయ్ అల్లుడికి ముందే తెలుసు
kadapa: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి(mp avinash reddy) తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి(ys bhaskar reddy)ని ఇవాళ సీబీఐ(cbi) అధికారులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయాన్నే పులివెందులకు వెళ్లిన సీబీఐ బృందం భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ తర్వాత పులివెందుల నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి.. అక్కడి నుంచి సీబీఐ న్యాయమూర్తి నివాసానికి తరలించగా.. భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌ను విధించారు. ఈనేపథ్యంలో తన తండ్రి అరెస్టుపై ఎంపీ అవినాష్ తొలిసారి స్పందించారు.
సీబీఐ అధికారులు వ్యక్తుల ఆధారంగా విచారణ చేపడుతున్నారని.. వాస్తవాలను వారు పట్టించుకోవట్లేదని ఆరోపించారు. తన తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై మాట్లాడటానికి మాటలు రావట్లేదని.. దీన్ని అసలు ఊహించలేదని తెలిపారు. ధైర్యం కోల్పోకుండా తాము నిజాయతీని నిరూపించుకుంటామన్నారు. వివేకా అల్లుడికి హత్య విషయం తనకంటే.. ఓ గంట ముందే తెలుసని ఆరోపించారు. హత్యకు సంబంధించి తానే పోలీసులకు ముందు ఫిర్యాదు చేశారని.. మరి వివేకా అల్లుడు పోలీసులకు ఎందుకు చెప్పలేదో తెలియదన్నారు. హత్య జరిగిన ప్రాంతంలో ఓ లెటర్ ఉందని.. దాన్ని వివేకా అల్లుడి వద్దే ఎందుకు ఉంచుకున్నారు. అందులో ఉన్న విషయాలు బయటకు రావాలన్నారు. వివేకా రెండో భార్యకు షహెన్‌షా అనే కుమారుడు ఉన్నాడని.. షేక్ మహ్మద్ అక్బర్‌గా 2010లో వివేకా పేరు మార్చుకున్నాక.. రెండో భార్యకే ఆస్తి రాసివ్వాలని వివేకా అనుకున్నారు. దానికి సంబంధించిన రౌండ్ సీల్స్, పత్రాలు వివేకా ఇంట్లో దొరికాయి. స్టాంప్ పేపర్లు పోతే ఎందుకు విచారణ జరపడం లేదని అవినాష్ తెలిపారు. వివేకా హత్య వెనుక వాస్తవాలు బయటకు రావాలని.. న్యాయం గెలవాలని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.