Viveka Case: మ‌రోసారి నోటీసులు..CBIకి అవినాష్ రిక్వెస్ట్

AP: వైఎస్‌ వివేకా(ys viveka case) హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి(avinash reddy) CBI మరోసారి నోటీసులు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కానీ అవినాష్ రెడ్డి(avinash reddy) మాత్రం 11 గంట‌ల‌కే వ‌స్తాన‌ని చెప్పార‌ట‌. వివేకా మర్డర్‌ కేసులో అవినాష్‌ను ఇప్పటికే అనేకసార్లు విచారించింది. దాదాపు 15 రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడు నోటీసులు జారీ చేయడం ఉత్కంఠ రేపుతోంది. అవినాష్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకే నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. అవినాష్‌ బెయిల్‌ పిటిషన్‌ రద్దు చేయాలని సీబీఐ కోర్టు ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై కోర్టు తీర్పు వెలువడాల్సి ఉంది. ఇప్పటి వరకు పలువురు సాక్షులు, నిందితుల నుంచి సీబీఐ వివరాలు రాబట్టింది. వాటి ఆధారంగా అవినాష్‌ను రేపు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. అరెస్టు చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.

అరెస్ట్ భయంతో అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, ఏప్రిల్ 25 వరకు అరెస్ట్ చేయవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం కొట్టివేసింది. ఇక తాజాగా ఇవాళ వివేకా కేసులో నిందితుడిగా ఉన్న ఉదయకుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఉదయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. అతడికి బెయిల్ ఇస్తే.. దర్యాప్తును ప్రభావితం చేస్తారంటూ సీబీఐ తరపు న్యాయవాది చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఇక ఉదయకుమార్ కు వివేకా హత్య గురించి బయటప్రపంచానికంటే ముందే తెలుసని సీబీఐ చెబుతోంది. హత్య జరిగిన ప్రాంతాల్లో సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో ఉదయ్‌ పాత్ర ఉన్నట్లు ఆరోపిస్తోంది.