avinash reddy: అరెస్టు గురించి ముందే తెలిసిందా? హైకోర్టులో పిటిషన్‌ దాఖలు!

Hyderabad: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసు(ys viveka murder case)లో విచారణ(investigation) ముమ్మరం చేశారు. అధికారులు ఇప్పటికే కేసుకు సంబంధించి అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఎంపీ అవినాష్‌ రెడ్డి(mp avinash reddy) తండ్రి, వైఎస్‌ జగన్‌(ys jagan) చిన్నాన్న భాస్కర్‌రెడ్డి(bhaskar reddy)ని సీబీఐ అధికారులు అరెస్టు చేసి తమ కస్టడీలోకి విచారణ నిమిత్తం తీసుకున్నారు. ఈక్రమంలో ఎంపీ అవినాష్‌ రెడ్డికి కూడా సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇవాళ మూడు గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరు కావాలని ఆదేశించింది. ఇవాళ తెల్లవారుజామునే ఆయన భారీగా అనుచరులతో 10 కార్లలో పులివెందుల నుంచి హైదరాబాద్‌కు బయలు దేరారు. అయితే సీబీఐ ముందస్తుగా అరెస్టు చేయకుండా.. తెలంగాణ హైకోర్టులో మరోసారి అవినాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తన తండ్రి భాస్కర్‌రెడ్డి కోర్టులో వేసిన పిటిషన్‌ విచారణలో ఉండగానే సీబీఐ అధికారులు అరెస్టు చేశారని అందులో ఆరోపించారు. ఇక చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌లో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను అవినాష్‌ తరపు న్యాయవాది దాఖలు చేశారు. సీబీఐ విచారణ మూడు గంటలకు జరగనుండగా.. హైకోర్టులో 2.30 గంటలకు అవినాష్‌ పిటిషన్‌ను న్యాయమూర్తి పరిశీలించనున్నారు.

ఈ కేసుకు సంబంధించి తనను సీబీఐ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉందని భావించిన అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీంతో హైకోర్టులో ఉన్న అన్ని పిటిషన్‌ల వివరాలను తమ ముందు ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరోవైపు హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు భాస్కర్‌రెడ్డికి 14 రోజులు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు. సీబీఐ మాత్రం వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి కీలకపాత్ర పోషించారని భావిస్తోంది. ఆయన తర్వాత ఎంపీ అవినాష్‌ పాత్ర కూడా ఉందని అనుకుంటున్నారు. ఆయన్ని కూడా ఇవాళ అరెస్టు చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.