Telangana: ఎన్నికలకు అధికారులు సిద్దంగా ఉండాలి- EC

Hyderabad: ఈ ఏడాది డిసెంబర్‌లో తెలంగాణ(telangana)లో అసెంబ్లీ ఎన్నికలు(assemble elections) నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల(election commission of india) సంఘానికి చెందిన ముగ్గురు సభ్యుల బృందం ఇవాళ తెలంగాణకు వచ్చింది. డిప్యూటీ కమిషనర్ నితీశ్‌వ్యాస్(nithish vyas) నేతృత్వంలోని ఈసీ బృందం హైదరాబాద్‌లోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్(vikas raj), ఇతర అధికారులతో శనివారం భేటీ అయ్యారు. మరోవైపు ఇప్పటికే తెలంగాణలోని రాజకీయ పార్టీలు సమరానికి సై అంటున్నాయి. మూడోసారి విజయం సాధించాలని బీఆర్ఎస్, అధికార పార్టీని ఏ విధంగానైనా ఓడించాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇప్పటికే ప్రజల మధ్యకు వెళ్లి తమకు మద్దతుగా నిలవాలని ఆయా పార్టీ నాయకులు కోరుతున్నారు. ఇవన్నీ నడుస్తున్న క్రమంలో రానున్న ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు తదితర వివరాల సేకరణకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఓ బృందాన్ని పంపింది.

ఈవీఎం(evms)ల సన్నద్ధత, ఓటర్ల జాబితాలో చేర్పులు, ఈవీఎంల తనిఖీ, అధికారులకు శిక్షణ తదితర అంశాలపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారులతో ఈ బృందం చర్చించింది. ఓటర్ల జాబితా మార్పులు చేర్పులపై సమీక్షించిన ఈసీ బృందం, ఎటువంటి లోపాలు లేకుండా జాబితా ఉండాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు రిటర్నింగ్ అధికారుల సమగ్ర జాబితాని కూడా సిద్ధం చేయాలని సీఈవోను ఆదేశించారు. ఆర్వోలు మే ఒకటి నుంచి ఈవీఎంలను తనిఖీ చేయాలని పేర్కొన్నారు. ఇదే సమయంలో జిల్లా స్థాయి ఎన్నికల అధికారులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఇప్పటినుంచే ప్రజలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు. జూన్ 1 నుంచి ఈవీఎంల మొదటి దశ చెకింగ్ చేపట్టాలని, ఈవీఎంలను పరీక్షించి జిల్లాలకు పంపాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు అధికారులు సిద్ధం కావాలని దిశా నిర్దేశం చేశారు. అధికారుల శిక్షణ కోసం ప్రణాళిక రూపొందించాలని ఈసీ బృందం సూచించింది.