Arvind kejriwal: సిసోదియాను తలుచుకుని కన్నీరుపెట్టిన సీఎం
Delhi: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) కంటతడి పెట్టారు. తన స్నేహితుడు, దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాను (manish sisodia) తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈరోజు దిల్లీలో ఓ కొత్త స్కూల్‌ను ప్రారంభించారు కేజ్రీవాల్. ఆ తర్వాత ఆయన ప్రసంగిస్తూ..ఇది తన స్నేహితుడు సిసోదియా కల అంటూ ఏడ్చేసారు. దిల్లీ లిక్కర్ స్కాంలో సిసోదియా తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.
“ఈరోజు నేను మనీష్‌ని చాలా మిస్సవుతున్నాను. ఇది తన కల. పిల్లలు అందరికీ సరైన విద్యను అందించాలని నాతో చాలా సార్లు అనేవాడు. ఈరోజు తన కల సాకారమైంది. పిల్లల కోసం స్కూల్స్, బిల్డింగ్స్ కట్టిస్తున్నందుకు మనీష్‌ను జైల్లో పెట్టారు. దిల్లీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకురావాలన్న మార్పును బీజేపీ నాశనం చేద్దామనుకుంటోంది. అలా జరగనివ్వను. ఓ మంచి మనిషిని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించారు. చాలా మంది దోపిడీ దొంగలు దేశంలో ఫ్రీగా తిరుగుతున్నారు. సిసోడియా స్కూల్స్ కట్టించకపోయి ఉంటే బహుశా బీజేపీ అతన్ని జైలుకు పంపించేది కాదేమో. ఆప్ ప్రభుత్వం గురించి ఎవరైనా మంచిగా మాట్లాడితే బీజేపీ ఓర్చుకోలేదు. సిసోడియా జైల్లో ఉన్నంత మాత్రాన అతని కలలు కలలుగానే మిగిలిపోకూడదు. త్వరలో సిసోడియా బయటికి వస్తాడన్న నమ్మకం ఉంది. అతను బయటికి వచ్చేలోగా విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో మనమంతా కృషి చేయాలి” అని కేజ్రీవాల్ అన్నారు.