Arvind Kejriwal: విచారణకు హాజరవుతా కానీ….

Arvind Kejriwal: లిక్కర్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎనిమిదోసారి దూరంగా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు కేజ్రీవాల్ కు నాలుగు నెలలుగా ఈడీ నోటీసులు ఇస్తున్న విషయం తెలిసిందే. తనకు నోటీసులు ఇవ్వడం చట్ట విరుద్ధం, రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగం, కోర్టు పరిధిలో ఉన్న అంశం అంటూ వివిధ కారణాలతో ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరవుతున్నారు. ఫిబ్రవరి 27న కేజ్రీవాల్ కు 8వ సారి ఈడీ సమన్లు పంపించింది.. మార్చి 4న విచారణకు రావాలని కోరింది. అయితే, కేజ్రీవాల్ ఈడీ విచారణకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు.

మార్చి 12 తరువాత ఈడీ విచారణకు సిద్ధంగా ఉన్నట్లు కేజ్రీవాల్ ఈడీకి సమాధానం పంపించినట్లు ఆప్ ఒక ప్రకటనలో తెలిపింది. తనకు ఈడీ జారీ చేస్తున్న నోటీసులు చట్ట విరుద్దమన్న కేజ్రీవాల్ .. సమాధానం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ క్రమంలో మార్చి 12వ తేదీ తరువాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని ఈడీకి కేజ్రీవాల్ తెలిపినట్లు ఆప్ ప్రకటనలో పేర్కొంది. సోమవారం విచారణకు హాజరు కావాలంటూ ఎనిమిదో సారి గత నెల 27న కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, కోర్టులో ఈడీ విచారణ అంశం పెండింగ్ లో ఉండటంతో నేటి విచారణకు దూరంగా ఉంటున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. కేజ్రీవాల్ ఈడీ ముందు హాజరు అంశంపై ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. గతంలో విచారణ సందర్భంగా మార్చి 16కి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎంను విచారించేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు ఎనిమిది సార్లు విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది. గతేడాది నవంబర్ 2, డిసెంబర్ 21న, జనవరి 3న, జనవరి 18న, ఫిబ్రవరి 2న, ఫిబ్రవరి 19న, ఫిబ్రవరి 22న, ఫిబ్రవరి 27న కేజ్రీవాల్ కు విచారణకు హాజరుకావాలని కోరుతూ ఈడీ నోటీసులు ఇచ్చింది. కేజ్రీవాల్ మాత్రం ఈడీ విచారణకు దూరంగా ఉంటున్నారు. (Arvind Kejriwal)

ఇది వరకే మద్యం కుంభకోణానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను కేజ్రీవాల్‌ పంచుకున్నారు. మద్యం కుంభకోణం కేసు రెండేళ్లుగా నడుస్తోందన్నారు. ఈ కేసులో ఈడీ వెయ్యికి పైగా దాడులు నిర్వహించిందని, తనను జైలుకు పంపడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేజ్రీవాల్‌ అన్నారు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు ఎంత మందిని అరెస్టు చేశారో తెలియడం లేదని కేజ్రీవాల్ అన్నారు. ఈ కేసులో ఈడీ ఇప్పటి వరకు డబ్బును రికవరీ చేయలేదన్నారు. ‘కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నన్ను పిలిపించడం కాదు, నన్ను అరెస్ట్ చేయడమే. దీనిని దేశం మొత్తం చూస్తోంది. ఈడీ సమన్లు ​​ఎలా చట్టవిరుద్ధమో తాను కోర్టుకు వెళ్లి వివరిస్తానన్నారు. కోర్టు చెబితే తప్పకుండా వెళ్తానని చెప్పుకొచ్చారు.

ఇక ఈడీ కారణంగా పార్టీలు చీలిపోతున్నాయని కేజ్రీవాల్‌ అన్నారు. మనీష్ జైల్లో ఉన్నారని, అతనికి బెయిల్ రావడం లేదు. ఇందులో ఎటువంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు పదేపదే చెప్పిందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తోంది.. పాఠశాలలు ఎలా నిర్మించాలో నాకు తెలుసు. మంచి విద్యను ఎలా అందించాలో తనకు తెలుసని కేజ్రీవాల్‌ చెప్పుకొచ్చారు. మరోవైపు, విచారణకు పేరుతో కేజ్రీవాల్ ను అరెస్టు చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇండియా కూటమి నుంచి వైదొలగాలని తమపై బిజెపి బెదిరింపులకు పాల్పడుతోందని.. కేజ్రీవాల్ ను అరెస్టు చేసి ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఈడీని అడ్డం పెట్టుకుని మోదీ సర్కార్ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆప్ నేతలు.