AP Elections: ఎన్నిక‌ల్లో వీరు ఓడిపోబోతున్నారా?

AP Elections: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు ర‌సవ‌త్త‌రంగా మారుతున్నాయి. ఎప్పుడైతే రాజ‌కీయ విశ్లేష‌కుడు ప్ర‌శాంత్ కిశోర్ (Prashant Kishor) వ్యాఖ్య‌లు చేసారో.. అప్ప‌టి నుంచి వాతావ‌ర‌ణం మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఎందుకంటే ప్ర‌శాంత్ కిశోర్ గ‌తంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని (Jagan Mohan Reddy) గెలిపించేందుకు సాయ‌శ‌క్తులా కృషి చేసారు. అయితే ఈసారి మాత్రం జ‌గ‌న్ విష‌యంలో ఆయ‌న స్వ‌రం మార్చారు. ఈసారి ఎన్నిక‌ల్లో ఆయన ఊహించ‌ని రీతిలో ఓడిపోతార‌ని అన్నారు.

ఈ నేప‌థ్యంలో గ‌తంలో చేయించిన స‌ర్వేలు, జాతీయ స‌ర్వేలు అన్నింటికీ క్రోడీక‌రించి ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎలాంటి ప‌రిస్థితి ఉందో చూసుకుని ఈసారి ఏపీలో అధికార పార్టీ నుంచి ప్ర‌ముఖ నాయ‌కులు ఎవ‌రెవ‌రికి ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌వుతాయో తెలుసుకుందాం. ఏపీలో ప‌ది మంది ప్ర‌ముఖులు దాదాపు ఓడిపోయే ప‌రిస్థితికి వ‌చ్చార‌ని స‌ర్వేలు చెప్తున్నాయి. వారెవ‌రంటే..

రోజా

మంత్రి రోజాకు (RK Roja) ఈసారి కూడా న‌గిరి టికెట్ ల‌భించింది. అయితే.. న‌గిరిలో ఆమెకు సానుకూల వాతావ‌రణం లేదు. అయినా టికెట్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

అంబ‌టి రాంబాబు

అంబ‌టి రాంబాబుకు కూడా ఈసారి స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం టికెట్ గెలుచుకున్నారు. నీటి పారుద‌ల శాఖ మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న పోల‌వ‌రం గురించి నీటిపారుద‌ల శాఖ గురించి కంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించే ఎక్కువ‌గా మాట్లాడుతుంటార‌న్న టాక్ ఉంది. స‌త్తెన‌ప‌ల్లిలో కూడా ఆయ‌న చేసిన మంచి ఏమీ లేద‌ని తెలుస్తోంది.

విడ‌ద‌ల ర‌జినీ

ఈసారి విడ‌ద‌ల ర‌జినీకి టికెట్ ద‌క్క‌దు అని చాలా మంది అనుకున్నారు. . గ‌త ఎన్నిక‌ల్లో చిల‌కలూరిపేట నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఆ నియోజ‌క‌వ‌ర్గంలో స‌రైన పేరు, సానుకూల‌త లేక‌పోవ‌డంతో ఆమెను గుంటూరు ప‌శ్చిమ‌కు పంపించారు. అయితే ర‌జినీ గుంటూరు ప‌శ్చిమ నుంచి పోటీ చేస్తే క‌చ్చితంగా ఓడిపోయే అవ‌కాశం ఉంద‌న్న టాక్ ఉంది.

పేర్ని కిట్టు

పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు మ‌చిలీప‌ట్నం నుంచి పోటీ చేయ‌నున్నారు. అయితే పేర్ని నాని ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న మంత్రిగా ఉన్న‌ప్పుడు కానీ గ‌తంలో కూడా ఎక్క‌డా స‌రిగ్గా ప‌నిచేసిన ప‌రిస్థితి లేద‌ని స‌ర్వేలు చెప్తున్నాయి. నియోజ‌క‌వర్గంలో ఆయ‌న‌కు వ్య‌తిరేక‌త ఉంది. ఇది పేర్ని కిట్టుపై కూడా ప్ర‌భావం చూసి ఆయ‌న ఓడిపోయే అవ‌కాశం ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.

కొడాలి నాని

కొడాలి నాని గుడివాడ‌లో చాలా బ‌ల‌మైన నాయ‌కుడు. గ‌త ప‌దేళ్లుగా గెలుస్తూ వ‌స్తున్నారు. అయితే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుపై ఆయ‌న చేసే వ్యాఖ్య‌లు… ముఖ్యంగా క‌మ్మ సామాజిక వ‌ర్గం నాయ‌కులు కాపు సామాజిక వ‌ర్గం నాయ‌కులు అంద‌రూ ఒక్క‌టై ఈసారి కొడాలి నానిని ఓడించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది.

వ‌ల్ల‌భ‌నేని వంశీ

గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో కూడా అంత ఈజీగా వైసీపీ గెలిచే అవ‌కాశం లేదు. వ‌ల్ల‌భ‌నేని వంశీకి టికెట్ ఇచ్చిన ప‌రిస్థితుల్లో ఆయ‌న‌కు అక్క‌డ ఉన్న క‌మ్మ సామాజిక వ‌ర్గం, ఇత‌ర వ‌ర్గాలు కూడా ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఉన్నాయి. (AP Elections)

జోగి ర‌మేష్‌

పెడ‌న నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు పెన‌మ‌లూరుకు బ‌దిలీ అయ్యారు. అక్క‌డ వ్య‌తిరేకత ఉంది కాబ‌ట్టే వేరే నియోజ‌క‌వ‌ర్గానికి షిఫ్ట్ చేసారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న పెన‌మ‌లూరులో గెలిచే అవ‌కాశం లేద‌నే క‌నిపిస్తోంది. నోటికి బాగా ప‌ని చెప్పారు కాబ‌ట్టి ఆ వ్య‌తిరేక‌త జోగి ర‌మేష్ మీద ఉంది.

వెల్లంప‌ల్లి శ్రీనివాస్

మాజీ మంత్రి శ్రీనివాస్ కూడా క‌చ్చితంగా ఈసారి ఓడిపోతార‌నే కొన్ని స‌ర్వేలు చెప్తున్నాయి. విజ‌య‌వాడ సెంట‌ర్ నుంచి పోటీ చేస్తున్న శ్రీనివాస్‌పై బోండా ఉమ పోటీ చేయ‌నున్నారు. ఇప్పుడు శ్రీనివాస్ గెల‌వ‌డం అనేది కాస్త క‌ష్టంతో కూడుకున్న ప‌నే.

చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ‌

ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గం నుంచి మారి రాజ‌మండ్రి రూర‌ల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజ‌వ‌క‌ర్గంలో తెలుగు దేశం నుంచి గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ఉన్నారు. ఈసారి రాజ‌మండ్రి రూర‌ల్ నుంచి వేణుగోపాల కృష్ణ తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కోబోతున్న‌ట్లు స‌ర్వేలు చెప్తున్నాయి.

మేరుగ నాగార్జున‌

ఈయ‌న ఉమ్మ‌డి గుంటూరు జిల్లా వేమూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2019లో గెలిచి మంత్రి అయ్యారు. ఈసారి ఆయ‌న్ను ఉమ్మ‌డి ప్ర‌కాశం సంత‌నూత‌ల‌పాడు నియోజ‌క‌వ‌ర్గానికి ఇన్‌ఛార్జిని చేసారు. క‌చ్చితంగా తెలుగు దేశం పార్టీ అభ్య‌ర్ధే సంత‌నూత‌లపాడులో గెలిచే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.  (AP Elections)