ఒంటిమిట్టకి జగన్‌ అందుకే వెళ్లలేదు – అచ్చెన్నాయుడు ఫైర్‌

కాలు బెణికిందన్న సాకుతో ఒంటి మిట్ట సీతారాముల వారి కళ్యాణానికి వెళ్లకుండా ఎగ్గొట్టిన సీఎం జగన్ నేడు చిలకలూరిపేట పర్యటనకు ఎలా వెళ్లారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. గురువారం నాడు టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. ‘శ్రీరాముడు ఆదర్శప్రాయుడు, ప్రతి ఒక్కరూ కొలుస్తారు, ఉమ్మడి ఏపీలో భద్రాచలంలో అంగరంగ వైభవంగా రాముల వారి కళ్యాణం చేయడం ఆనవాయితీ. ఏపీ విభజన తర్వాత ఆ సంప్రదాయాన్ని ఒంటిమిట్ట కోదండరామాలయంలో టీడీపీ ప్రభుత్వం కొనసాగించింది. నాటి సీఎం చంద్రబాబు ఒంటిమిట్ట ఆలయాన్ని అభివృద్ధి చేశారు. అధికారిక లాంఛనాలతో ఒంటిమిట్ట కోదండ రామాలయంలో కళ్యాణాన్ని జరిపించాం. కళ్యాణోత్సవానికి సీఎం దంపతుల వెళ్లడం ఆనవాయితీ. శ్రీరామ నవమి రోజున రాముల వారి కళ్యాణోత్సవానికి సీఎం జగన్ వెళ్తారని షెడ్యూల్ ఇచ్చారు. కానీ కాలు బెణికిందనే సాకుతో జగన్ ఒంటిమిట్ట వెళ్లలేదు. సతీసమేతంగా వెళ్లాలి కాబట్టే జగన్ ఒంటిమిట్ట వెళ్లలేదని’ అచ్చెన్నాయుడు ఆరోపించారు. ‘జగన్ వేరే మతాన్ని ఆచరించొచ్చు.. కానీ సీఎం హోదాలో ఒంటిమిట్ట వెళ్లాలి కదా..? కాలు నొప్పి సాకుతో ఒంటిమిట్ట వెళ్లని జగన్ .. నిన్న జగ్జీవన్‌ రాం జయంతి, నేడు చిలకలూరి పేట కార్యక్రమాల్లో ఎలా పాల్గొన్నారు? ఒక్క రోజులోనే కాలు నొప్పి తగ్గిపోయిందా’ అని ఆయన ప్రశ్నించారు. ‘జగన్ రెడ్డి తన వ్యవహారశైలితో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని.. పాదయాత్రలో అన్ని వేల కిలోమీటర్లు నడిస్తేనే బెనకని కాలు, కేవలం సీతారాముల కళ్యాణం ముందు రోజే బెణుకుతుందా?’ అని ప్రశ్నించారు.

ధర్మానకు మైండ్‌ పనిచేయట్లేదు..
మంత్రి ధర్మాన ప్రసాద్‌కు మైండ్ పని చేయడం లేదని, ధర్మాన తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ బ్యాలెన్స్ తప్పలేదని అచ్చెన్నాయుడు అన్నారు. ఒకవేళ ఆ పార్టీలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. ప్రజా వ్యతిరేకతతో ధర్మాన బ్యాలెన్స్ తప్పారోమో అని అనుమానం వ్యక్తం చేశారు. ‘ధర్మాన మహిళల ముందు మీసాలు మేలేస్తున్నారు.. తొడ కొడుతున్నారు. మగాళ్లను పొరంబోకులు అంటూ ధర్మాన విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం జగన్, ధర్మాన కూడా మగాళ్లే కదా..? అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్బంగా చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.