ap ministers: నోరు అదుపులో పెట్టుకోవాలి – పవన్‌ వార్నింగ్‌

vijayawada: ఏపీలోని అధికార వైసీపీ మంత్రులు(ycp ministers) నోరు అదుపులో పెట్టుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ (janasena chief pawan kalyan) వార్నింగ్‌ ఇచ్చారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి విషయమై రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. తొలుత తెలంగాణ మంత్రి హరీష్‌రావు ( telangana minister harish rao) ఏపీలో అభివృద్ది లేదని.. తెలంగాణకు వలస వచ్చే కార్మికులు ఇక్కడికి తమ ఓటు హక్కును మార్చుకోమని సూచించారు. దీనిపై ఏపీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు (ap minister karumuri nageshwar Rao), సీదిరి అప్పలరాజు(appalaraju), బొత్స సత్యనారాయణ(botsa sathyanarayana), మాజీ మంత్రి పేర్ని నాని(perni nani) సహా పలువురు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి హరీష్‌‌రావు కూడా కౌంటర్‌ ఇచ్చారు. అయితే.. మంత్రి సీదిరి అప్పలరాజు మాత్రం తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుటంబాన్ని, అక్కడి ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారు. ఈ వ్యవహారంపై సీఎంవో కూడా అప్పలరాజును మందలించిందని వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ మంత్రుల వ్యాఖ్యలపై స్పందించారు.

అభివృద్ధికి సంబంధించిన అంశాలపై విమర్శలు చేసుకుంటే పెద్దగా ఇబ్బంది లేదని.. కానీ తెలంగాణ ప్రజల్ని కించపరిచేలా ఏపీ మంత్రుల వ్యాఖ్యలు ఉన్నాయని పవన్‌ మండిపడ్డారు. వైసీపీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని.. ఎప్పుడైనా.. పాలకులు వేరు, ప్రజలు వేరు అని జనసేన ముందు నుంచి చెబుతూనే ఉందన్నారు. ఈ విషయాన్ని వైసీపీ అర్థం చేసుకోవట్లేదని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడడం తనకు బాధ కలిగించిందన్నారు. వైసీపీ నాయకులు కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలని హితవుపలికారు. ఆంధ్ర పాలకులకు తెలంగాణలో వ్యాపారాలు, ఇళ్లు ఉన్నాయని గుర్తుచేశారు. ఒక వ్యక్తి విమర్శ చేస్తే ఆ వ్యక్తి పరంగానే ప్రతి విమర్శ ఉండాలని సూచించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోని ఆయన సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.