politics: ష్‌… మంత్రి అప్పలరాజుకి మళ్లీ క్లాస్‌!

vijayawada: ఎన్ని గొడవలు ఉన్నా.. సమస్యలు ఉన్నా పొరుగు రాష్ట్రంతో సఖ్యతగా ఉండటం మేలు. ఈ విషయాన్ని గ్రహించలేకపోతున్నారో.. లేదా.. రాజకీయంగా అదో అడ్వాంటేజ్‌ అనుకుంటున్నారో ఏమీ కానీ.. ప్రస్తుతం ఏపీ – తెలంగాణలో అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని దిగజార్చేలా ఉన్నాయి. మొదటి నుంచి తెలంగాణ మంత్రులు కేటీఆర్‌(ktr), హరీష్‌రావు(harish rao)లు తెలంగాణలో ఎక్కడాలేని అభివృద్ధి జరుగుతోందని.. ఆంధ్రలో అన్ని ఇబ్బందులేనని విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా హరీష్‌రావు మరోసారి ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మరి వాయినం పుచ్చుకున్నప్పుడు.. తిరిగి మరో వాయినం ఇవ్వాలన్నట్లుగా.. ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. కొందరు సున్నితంగా మండిపడితే.. మన పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు(appalaraju) మాత్రం తగ్గేదేలే అన్నట్లు సీఎం కేసీఆర్‌ మొదలుకుని ఆ కుటంబంలో ఉన్న అందరి గురించి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

‘ఒళ్లు కొవ్వెక్కి హరీష్‌ రావు మాట్లాడుతున్నాడని, కేసీఆర్‌ కల్లు తాగుతున్నాడని, ఆంధ్రావాళ్లు తెలంగాణ వెళ్లడం మానేస్తే.. అక్కడి వారు అడుక్కుతినాలి’ అని అభ్యంతరకర పదాలను ఆయన మాట్లాడారు. దీంతో మంత్రి అప్పలరాజుకు సీఎం(cmo) కార్యాలయం నుంచి ఫోన్‌ వెళ్లిందని.. ఆయన్ని మందలించారని వార్తలు వస్తున్నాయి. కానీ.. మంత్రి చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంత గీత దాటి మాట్లాడారని విన్నవారికి ఎవరికైనా అర్థమవుతుంది. ప్రధానంగా తెలంగాణకు మనకు మధ్య నీటి ఒప్పందాలు ఉన్నాయి. దీనిపై గొడవలు, వివాదాలు జరుగుతున్నాయి. దీంతోపాటు నిధుల పంపకాలు కూడా పూర్తిగా జరగలేదు. ఏపీ ప్రజలు హైదరాబాద్‌లోనే ఉద్యోగాలు చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ స్థాయి ఉన్న నాయకులపై దిగజారి మాట్లాడటం సరికాదని సీఎంవో చురకలు అంటించినట్లు సమాచారం. విమర్శల్లో పరుష పదజాలం ఉపయోగించవద్దని, మనం మాట్లాడే భాషను దృష్టిలో ఉంచుకోవాలని సీఎంఓ వర్గాలు క్లాస్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మంత్రి సీదిరి అప్పలరాజు వైపు నుంచి స్పందన లేదు.