CM Jagan: నిర్మలా సీతారామన్‌తో AP సీఎం భేటీ
AP: న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (nirmala sitaraman) తో AP ముఖ్యమంత్రి YS జగన్ (cm jagan) భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాలపాటు ఈ సమావేశం సాగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. 2014-15కి సంబంధించిన వనరుల గ్యాప్ ఫండింగ్, 2016-2019 మధ్య కాలంలో జరిగిన పరిమితికి మించి రుణాల కారణంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న పర్యవసానాలు, 2021-22లో రుణాల పరిమితిపై సడలింపులు అంశాన్ని ఆర్థికమంత్రితో సీఎం చర్చించారు. రాష్ట్రాన్ని విభజించిన తర్వాత తెలంగాణ డిస్కంలకు ఏపీ జెన్‌కో సరఫరా చేసిన విద్యుత్, రూ.6,756.92కోట్ల బకాయిల అంశాన్నీ ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఇప్పటికే పలుమార్లు ఈ అంశాన్ని కేంద్ర దృష్టికి తీసుకొచ్చిన అంశాన్నీ గుర్తుచేశారు. ఏపీ జెన్‌కో ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ డబ్బు చాలా అవసరమని, జాప్యం లేకుండా వీలైనంత త్వరగా ఈ డబ్బు ఇప్పించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే కేపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ మీద కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టెన్స్ ఇచ్చేలా బడ్జెట్‌లో పొందుపరిచారని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాల్లో అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టిందని, స్కూళ్లలో నాడు – నేడు కింద ఇప్పటికే రూ.6వేల కోట్లు ఖర్చుచేసిందని, తొలిదశ కింద 15,717 స్కూళ్లలో నాడు-నేడు కూడా పూర్తయ్యిందని, ఆరో తరగతి నుంచి ఐఎఫ్‌పీ ప్యానెల్స్ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని సీఎం తెలిపారు. అలాగే ఆరోగ్య రంగంలో కూడా నాడు -నేడు కింద అనేక చర్యలు చేపట్టామని, విలేజ్ క్లినిక్స్ నుంచి టీచింగ్ ఆస్పత్రుల వరకూ నాడు -నేడు కింద పనులు చేపట్టామని, ఇప్పటికే దీనికోసం రూ.4వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తును ఈ కార్యక్రమాలు తీర్చిదిద్దుతాయని, వీటికోసం చేసిన ఖర్చును క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించి స్పెషల్ అసిస్టెన్స్‌ను వర్తింపు చేయాల్సిందిగా సీఎం జగన్ కోరారు.