Anil Kumar Yadav: జ‌గ‌న్‌ను ఇప్పుడు తిడితే ఎట్లా?

Anil Kumar Yadav: YSRCP నేత అనిల్ కుమార్ యాద‌వ్‌ను నెల్లూరు పార్ల‌మెంట్ ఎంపీగా పోటీ చేయ‌మ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (Jagan Mohan Reddy) ఆదేశించారు. అయితే ఈ నిర్ణ‌యం ప‌ట్ల అనిల్ కుమార్ యాద‌వ్ ఆగ్ర‌హంతో ఉన్నార‌ని పార్టీకి రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీలో చేర‌తార‌నే టాక్ కూడా వ‌చ్చింది. దీనిపై అనిల్ కుమార్ యాద‌వ్ స్పందించారు.

“” పార్టీలో ఉన్నప్పుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంత గొప్పోడు ఇంత గొప్పోడు అని పొగుడుతారు. ఆయ‌న టికెట్ ఇవ్వ‌క‌పోయినా లేదా వేరే ప్రాంతం నుంచి పోటీ చేయ‌మంటే రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్లిపోతారు. అప్పుడు మాత్రం జ‌గ‌న్ అలాంటోడు ఇలాంటోడు అని నోటికొచ్చిన‌ట్లు మాట్లాడ‌తారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీ హైక‌మాండ్ గెల‌వాల‌న్న ఉద్దేశంలో కొంద‌రు నేత‌ల‌ను అటు ఇటు మార్చ‌డం వేరే స్థానాల నుంచి పోటీ చేయ‌డం వంటివి జ‌రుగుతుంటాయి.

అంత‌మాత్రాన పార్టీల నుంచి వెళ్లిపోతాను అన‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్? వెళ్తే వెళ్లారు. జ‌గ‌న్ అన్న‌ను నోటికొచ్చిన‌ట్లు ఎలా తిడ‌తారు? ఇదో ఫ్యాష‌న్ అయిపోయింది. రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీలో చేరేవారంతా చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) ఇచ్చిన స్క్రిప్ట్‌ని చ‌దువుతుంటారు. ఆ స్క్రిప్ట్‌లో ఏ మార్పూ ఉండ‌దు. పార్టీలో ఉన్న‌ప్పుడు మాత్రం బాగా డ‌బ్బులు వెన‌కేసుకుంటారు. జ‌గ‌న్ అన్న ఎమ్మెల్యే టికెట్ ఇవ్వ‌కుండా రాజ్య‌స‌భ ఎంపీ టికెట్ ఇస్తానంటే అందులో త‌ప్పేముంది? రాజ్య‌స‌భ సీటు ప‌ద‌వి కాదా? నేను బీసీ అభ్య‌ర్ధిగా ఎమ్మెల్యేగా ప‌నిచేసా. న‌న్ను వేరే ప్రాంతంలో బీసీ నేతగా నిల‌బెడితే స్థానిక నేత‌లు కాస్త మండిప‌డ‌తారు. అది ఏ పార్టీలో అయినా స‌హ‌జ‌మే. ఈ మాత్రం దానికి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బీసీల‌కు ఏమీ చేయ‌లేదు అని ఎలా అంటారు?

70 సంవ‌త్స‌రాల త‌ర్వాత పార్ల‌మెంట్‌కు ఒక బీసీ అభ్య‌ర్ధిని పంపాల‌నుకోవ‌డం మంచి విష‌యం కాదా? మ‌న బీసీల గురించి ఆలోచించే క‌దా పార్ల‌మెంట్ సీటు ఇస్తున్నారు? రాజీనామాలు చేసి తెలుగు దేశం పార్టీలోకి వెళ్లాల‌నుకునే వారికి చంద్ర‌బాబు ఎర్ర తివాచీ వేసి మ‌రీ వెంట‌నే అపాయింట్‌మెంట్స్ ఇస్తున్నారా? చంద్ర‌బాబు నాయుడు ఎంత మందికి బీసీ టికెట్లు ఇచ్చారు? ఈరోజు జ‌గ‌న్ ఒంగోలు, నెల్లూరులో బీసీ అభ్య‌ర్ధులను ఇచ్చారు. ఇంకా కొత్త‌గా బీసీ నేత‌లు వ‌స్తున్నారు. తెలుగు దేశం పార్టీ ఎన్ని ఇచ్చింది? వెళ్లాల‌నుకునేవారు వెళ్లిపోండి. అంతేకానీ జ‌గ‌న్ గురించి త‌ప్పుగా మాట్లాడ‌ద్దు. అది కరెక్ట్ ప‌ద్ధ‌తి కాదు.

ఒక నాయ‌కుడు ముఖ్య‌మంత్రి కావాల‌నుకున్న‌ప్పుడు త‌న బ‌లాన్ని కూడా పెంచుకోవాల‌నుకుంటాడు. ఫ‌లానా ప్రాంతంలో ఫ‌లానా ఎమ్మెల్యే వ‌ర‌కు గెల‌వలేం అనుకున్న‌ప్పుడు వేరే ప్రాంతానికి త‌ర‌లిస్తారు. అందులో త‌ప్పేముంది?  నేను ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు నా నియోజ‌క‌వ‌ర్గంలోని కార్పొరేట‌ర్లు గెల‌వాల‌నుకుంటే గెలిచే కార్పొరేట‌ర్ల‌నే ఎంచుకుంటాను క‌దా..! పార్టీ బ‌తికుంటే క‌దా మేం బ‌తికుంటాం. ఒక మ‌నిషి ఎలాంటివాడో తెలిసేది బాగున్నప్పుడు ఇలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడే. బాగున్న‌ప్పుడు అంద‌రూ మ‌న‌తోనే ఉంటారు. బాలేనప్పుడు ఎవ‌రు వెన‌క నిల‌బ‌డ్డారు అనేదే ముఖ్యం “”  అని మండిప‌డ్డారు.