Ambedkar: అంబేడ్కర్ విగ్రహం విశేషాలు ఇవే..!
Hyderabad: తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచేలా.. హైదరాబాద్ నగరంలో రూపుదిద్దుకుంది… 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం. దాదాపు రెండేళ్ల శ్రమ.. ఎన్నో ఇబ్బందులు, అవస్థలు కోర్చిన కార్మికులు, అధికారుల కష్టం నేటికి ఫలించింది. అసలు అంబేడ్కర్ విగ్రహం ప్రత్యేకతలు, విశిష్టతలు ఏంటి అన్న విషయాలను ఒకసారి తెలుసుకుందామా..
హుస్సేన్‌సాగర్ పక్కనే దాదాపు 11 ఎకరాల స్థలంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. నేడు ఆయన జయంతి సందర్బంగా సీఎం కేసీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. అయితే 125 అడుగుల ఎత్తున్న ఇలాంటి భారీ విగ్రహం దేశంలో మరెక్కడా లేదు. ఈ విగ్రహాన్ని ప్రఖ్యాతి శిల్పి రామ్ వాంజి సుతార్, అతని కుమారుడు కలిసి రూపొందించారు. అంబేద్కర్ విగ్రహానికి సుమారు 111 టన్నుల హై ఎండ్ బ్రాంఙ్ మెటాలిక్ ఫినిష్ ని వినియోగించారు. ముందుగా స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ తయారు చేసి కంచు ఫలకాలను వెల్డింగ్ చేశారు. విగ్రహం అతి పెద్దది కావడంతో ప్రతీ 10 ఫీట్ల భాగాన్ని నోయిడాలో తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. బాబాసాహెబ్ బూట్లు, షూ లేసులు, దుస్తులు, ముఖకవళికలు ఎంతో జాగ్రత్తగా తయారు చేశామని ఆర్కిటెక్ట్ బృందం తెలిపింది. బాబాసాహెబ్ ఎడమ చేతిలో ఉండే.. భారత రాజ్యాంగం అసలు ప్రతిని పోలి ఉండేలా రూపొందించామని.. Constitution of India లోని India అనే అక్షరాలు చాలా దూరం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తాయని చెబుతున్నారు.
రాజస్థాన్‌లో లభించే… బీజ్ శాండ్ స్టోన్‌గా పిలిచే.. ఇసుకరాతితో బాబాసాహెబ్ విగ్రహం కింద భారత పార్లమెంట్ భవనాన్ని పోలి ఉండేలా దాదాపు 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పార్లమెంట్ నమూనా భవనం నిర్మించారు. ఇక్కడ మ్యూజియం, విశాలమైన హాల్ , అతిపెద్ద గ్రంథాలయం ఉన్నాయి. అదేవిధంగా భారత రాజ్యాంగ ప్రతులు, అనేక చారిత్రక విశేషాలతో కూడిన ఆడియో విజువల్ హాల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు.