Ambati Rambabu: పోలవరం నాకే కాదు ఎవరికీ అర్థంకాదు.. చంద్రబాబు నేను చెప్పిందే చెప్తున్నాడు
Ambati Rambabu: పోలవరం ప్రాజెక్ట్ చాలా క్లిష్టమైన ప్రాజెక్ట్ అని ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన తనకే అర్థంకాలేదంటే ఇక ఎవరికీ అర్థంకాదని వైఎస్సార్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు అన్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ను సందర్శించారు. జగన్ ఆ ప్రాజెక్ట్ను ఎంతగా నాశనం చేసాడంటే అది పూర్తవడానికి నాలుగేళ్లు పడుతుందని చంద్రబాబు అన్నారు. దీనిపై అంబటి రాంబాబు స్పందించారు.
“” పోలవరం ప్రాజెక్ట్ నాకే అర్థంకాలేదంటే ఇంకెవ్వరికీ అర్థంకాదు. సాధారణంగా ఇలాంటి ప్రాజెక్ట్లు కట్టే సమయంలో ముందు రెండు కాఫర్ డ్యాంలు కట్టాకే డయాఫ్రాం వాల్ వేయాలి. కానీ 2019 ఎన్నికలకు ముందు మళ్లీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు అప్పటికప్పుడు నదిని మళ్లించడానికి కాఫర్ డ్యాంలు కట్టకుండా డయాఫ్రాం వాల్ కట్టేసారు. దాని వల్ల వరదలు వస్తే చుట్టుపక్కల ఉన్న 50 గ్రామాలు నీటమునిగే అవకాశం ఉంటుంది. ఈ తప్పిదం చంద్రబాబు చేసి మా ప్రభుత్వంపై తోస్తున్నారు. ఈ పోలవరం ఇప్పుడే పూర్తి కాదు మొదటిసారి చెప్పింది నేనే. ఇప్పుడు అదే మాట చంద్రాబాబు నాయుడు చెప్తున్నారు “” అని తెలిపారు.