Ambati Rambabu: తెలంగాణ‌లో ఏ పార్టీ వ‌స్తుందో మాకు అన‌వ‌స‌రం

Ambati Rambabu: నాగార్జున సాగ‌ర్ డ్యాం (nagarjuna sagar dam) వ‌ద్ద ఏపీ తెలంగాణ పోలీసుల ఘ‌ర్ష‌ణ‌పై స్పందించారు ఏపీ ఇరిగేష‌న్ శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు. ఏపీ భూభాగంలో కూడా తెలంగాణ పోలీసులు ప‌హారా కాస్తున్నార‌ని.. మ‌న‌కు రావాల్సిన నీళ్లకు కూడా వారి అనుమ‌తి తీసుకోవాల్సిన దౌర్భాగ్య ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని మండిప‌డ్డారు. ఈ ప‌రిస్థితి ఏర్ప‌డ‌టానికి కార‌ణం చంద్ర‌బాబు నాయుడేన‌ని అన్నారు. ఈ అన్యాయాన్ని స‌రిదిద్ద‌డం దండ‌యాత్ర ఎలా అవుతుందని చంద్ర‌బాబు కోసం ప‌నిచేసే ప‌త్రిక‌లు త‌ప్పుడు వార్త‌లు ఎలా రాస్తారని ప్ర‌శ్నించారు.

“” ఈ నాగార్జున సాగ‌ర్ స‌మ‌స్య‌ను మేం కావాల‌నే సృష్టించామ‌ని కొన్ని ప‌త్రిక‌లు రాస్తున్నాయి. తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రిగాయి కాబ‌ట్టి ఒక పార్టీకి మేలు చేయ‌డం కోసం ఆ పార్టీని గెలిపించ‌డం కోసం మేం ఈ డ్రామా ఆడుతున్నామ‌ని అంటున్నారు. తెలంగాణ రాజ‌కీయాలు వేరు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు వేరు. మా పార్టీ తెలంగాణ‌లో లేదు. మేం అక్క‌డ పోటీ చేయం. కృష్ణా జ‌లాల్లో 66% ఏపీకి 34% తెలంగాణకు రావాలి. మేం 66% కంటే ఒక్క బొట్టు కూడా ఎక్కువ‌గా వాడుకోం. కానీ తెలంగాణ శ్రీశైలం నీటిని మాత్రం లిమిట్‌కి మించి కొన్నిసార్లు బాగానే వాడుకుంది. ఎందుకంటే ప‌వ‌ర్ స్టేష‌న్లు వారి చేతుల్లోనే ఉన్నాయి. తెలంగాణ‌లో ఏ పార్టీ గెలుస్తుందో ఏ పార్టీ ఓడిపోతుందో మాకు అన‌వ‌సరం. మేం నీటి విష‌యంలో మా హ‌క్కును మాకు క‌ల్పించాల‌ని మాత్ర‌మే కోరుతున్నాం “” అని తెలిపారు.