Amaravathi: అమరావతిలో ఫిలిం నగర్..!
Amaravathi: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఫిలిం నగర్ ఉన్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనూ ఓ ఫిలిం నగర్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చిత్ర పరిశ్రమకు చెందిన టాప్ నిర్మాతలు ఫిలిం నగర్ ఏర్పాటు అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ ఆలోచన ఇప్పటికి కాదట. నాలుగేళ్ల క్రితమే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఈ ప్రతిపాదన వచ్చింది. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫిలింనగర్ ఏర్పాటుకు 369 ఎకరాల భూమిని కేటాయించారు. దీనికి ఏపీ చలన చిత్ర మండలి అని కూడా పేరుపెట్టారు. కానీ జగన్ ప్రభుత్వంలో అది సాకారం అవుతుందని అనుకున్నారు కానీ అలా కాలేదు. కనీసం ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు హయాంలో ఆ పని పూర్తి అవుతుందని చిత్ర పరిశ్రమ ఆశిస్తోంది. అయితే అమరావతిలో కానీ విశాఖ పట్నంలోని భీమిలి వద్ద కానీ కుదిరితే రెండు ప్రాంతాల్లోనూ ఈ ఫిలింనగర్ ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు.