Princess Diya Kumari: కోటలో రాజకుమారి.. డిప్యూటీ సీఎంగా మారి..!
Princess Diya Kumari: కోటలో రాజకుమారి.. దియా కుమారి.. రోడ్లపై నడిచే యువరాణి.. యావత్ రాజస్థాన్ ఈమె గురించే చర్చించుకుంటోంది ఇప్పుడు. ఎందుకంటే ఈమెది రాజవంశం. మొన్న జరిగిన రాజస్థాన్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిని దక్కించుకుంది. దియా కుమారిని మరో వసుంధర రాజేగా భావిస్తున్నారు రాజస్థాన్ ప్రజలు. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా చేస్తారని అనుకున్నారు కానీ ఎందుకొచ్చిన గొడవలే అనుకుని BJP హైకమాండ్ ఈమెకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి చేతులు దులిపేసుకుంది.
ఎవరీ దియా కుమారి?
జైపూర్‌ను పాలించిన చివరి మహారాజు మాన్ సింగ్ -2 ముని మనవరాలే ఈ దియా కుమారి. ప్రస్తుతం ఈమెను జైపూర్ యువరాణి అని సంబోధిస్తున్నారు. ఆచారాలను పక్కన పెట్టి దియా కుమారి 1997ల నరేంద్ర సింగ్ అనే సాధారణ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ 2019లో వీరు విడాకులు తీసుకున్నారు. ఈసారి రాజస్థాన్ ఎన్నికల్లో BJP దియా కుమారికి జైపూర్‌లోని విద్యాధర్ నగర్ నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చింది. దియా కుమారి అనూహ్యంగా 71000 ఓట్ల మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకున్నారు.
లండన్‌లో ఫిలాసఫీలో పీహెచ్డీ చేసిన దియా కుమారి ప్రస్తుతానికి జైపూర్‌లోని అంబర్ అనే ప్రాంతంలో ఉన్న జైగడ్ కోటను హోటల్‌గా మార్చి ఆ బాధ్యతలు చూసుకుంటున్నారు. దీంతో పాటు మహారాజా సవాయ్ మాన్ సింగ్ పేరిట నెలకొల్పిన మ్యూజియం ట్రస్ట్‌ను, జైగడ్ పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్‌ను చూసుకుంటున్నారు. వీటితో పాటు రెండు పాఠశాలలు, 3 హోటల్స్ కూడా ఉన్నాయి.
2013లో BJP చొరవతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు దియా కుమారి. అదే ఏడాదిలో సవాయ్ మాధోపూర్ నుంచి పోటీ చేసి గెలిచిన దియా కుమారి తన రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా ఓటమిని చూడలేదు. 2019లో రాజసమంద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కూడా గెలుపొందారు. ఇప్పుడు రాజుల కాలం కాకపోయినప్పటికీ రాజ కుటుంబీకులకు రాజస్థాన్‌లో ఇప్పటికీ అంతే మర్యాద గౌరవం ఉన్నాయి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా రాజకుటుంబీకులను ప్రభుత్వంలో కలుపుకోనిదే ఏ పార్టీ కూడా రాజస్థాన్‌లో గెలవలేదు కూడా. మరి ఈ రాజకుమారి వసుంధర రాజేలాగా చక్రం తిప్పుతుందో లేదో చూడాలి.