236 సార్లు ఓడిపోయి..ఇప్పుడు కేసీఆర్‌పై పోటీ..!
Telangana Elections: ఎన్నికల్లో ఒకసారి ఓడిపోతే మళ్లీ వచ్చే ఎన్నికల్లో చూసుకుందాంలే అనుకునేవారు ఉంటారు. అప్పటికీ ఓడిపోతే ఇక రాజకీయాలు వద్దు అనుకుంటారు. అలాంటిది ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 236 సార్లు ఓడిపోయారు. అయినా కూడా త్వరలో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనున్నారు. అందుకే అందరూ ఇతన్ని ఎలెక్షన్ కింగ్ (election king) అంటుంటారు. అసలు ఎవరు ఇతను? ఎందుకు ఓడిపోతున్నా పోటీ చేస్తున్నారు?
ఇతని పేరు కే పద్మరాజన్ (k padmarajan). తమిళనాడులోని సేలం ఇతని స్వస్థలం. నవంబర్ 3 నుంచి తెలంగాణలో నామినేషన్లు ప్రారంభం కావడంతో తన నామినేషన్ వేయడానికి తెలంగాణకు వచ్చారు. పైగా ఇతను ఏ సీటులో బరిలో దిగనున్నారో తెలుసా..? సీఎం KCR నియోజకవర్గం అయిన గజ్వేల్ (gajwel).
అయితే ఇప్పటివరకు 236 సార్లు పోటీ చేసి ఓడిపోతూ వస్తున్నప్పుడు మళ్లీ మళ్లీ ఎందుకు పోటీ చేస్తున్నారు అని అడగ్గా.. అసలు గెలవాలన్న ఉద్దేశం ఉంటే కదా అంటున్నారు పద్మరాజన్. తనకు కేవలం పోటీ చేయాలని మాత్రమే ఉందట. గెలవడం కోసం ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అంటున్నారు. ప్రపంచ రికార్డు సాధించడం కోసమే ఇలా ఎన్నికలు వచ్చిన ప్రతీసారి పోటీ చేస్తున్నానని తెలిపారు. 1988 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు పద్మరాజన్. రాష్ట్రపతి పదవికి, ఎంపీ, ఎమ్మెల్యే ఇలా ఆయన పోటీ చేయని పదవి అంటూ లేదు. (telangana elections)
ఇతనికి టైర్ల బిజినెస్ ఉంది. నెలకు రూ.1 లక్ష ఆదాయం వస్తుంది. కేరళలోని కన్నూరులో ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి వరకు పద్మరాజన్ విద్యనభ్యసించారు. ఆ తర్వాత అన్నామలై ఓపెన్ యూనివర్సిటీలో హిస్టరీలో ఎంఏ చేసారు. గజ్వేల్‌లో తన నామినేషన్ పత్రాలకు సమర్పించాక తిరిగి సేలం వెళ్లిపోయారు పద్మరాజన్.