Asaduddin Owaisi: భ‌ర్త‌ల‌కు భార్య సంపాద‌న‌పై హ‌క్కు లేదు

Asaduddin Owaisi: AIMIM అధినేత అస‌దుద్దిన్ ఒవైసీ రిలేష‌న్‌షిప్ స‌ల‌హా ఇచ్చారు. భార్య‌పై కోప‌డ‌టం, ఆమె ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డంలో మ‌గ‌త‌నం లేద‌ని.. ఆమె కోపాన్ని త‌ట్టుకుని నిల‌బ‌డ‌టంలో ఉంద‌ని అన్నారు.

భార్య‌ల ప‌ట్ల సున్నితంగా ఉండాలి

ఓ పార్టీ కార్య‌క్ర‌మంలో అస‌దుద్దిన్ కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడుతూ మ‌గ‌వారు భార్య‌ల ప‌ట్ల సున్నితంగా వ్య‌వ‌హ‌రించాల‌ని తెలిపారు. “” ఈ విష‌యాన్ని నేను చాలా సార్లు చెప్పాను. నేను చెప్తే చాలా మందికి ఈ మాట న‌చ్చ‌దు. భార్య‌లు భ‌ర్త‌కు మ‌సాజ్‌లు చేయాల‌ని, వారికి వండి పెట్టాల‌ని, వారికి సేవ చేయాల‌ని ఎక్క‌డా ఖురాన్‌లో రాసి లేదు. అంతేకాదు భార్య‌ల సంపాద‌న‌పై కూడా భ‌ర్త‌ల‌కు ఎలాంటి హ‌క్కు ఉండ‌దు. కానీ భార్య‌ల‌కు భ‌ర్త‌ల సంపాద‌న‌పై హ‌క్కు ఉంటుంది. ఎందుకంటే ఇల్లు న‌డిపించాల్సింది వారే కాబ‌ట్టి. త‌మ మాట విన‌డంలేద‌ని భార్య‌ల‌ను కొట్టే భ‌ర్త‌లు ఉన్నారు. మీరు నిజంగానే మ‌హ్మ‌ద ప్ర‌వ‌క్త అనుచ‌రులైతే ఆయ‌న ఏ మ‌హిళ‌పై చేయి వేసారో చెప్పండి. ఇలా చేసేవారిని ఇస్లాం మ‌తం అస్స‌లు క్ష‌మించ‌దు “” అని తెలిపారు.