One Nation One Election: ఎందుకు.. ఏమిటి.. ఎలా..?
ఒకే దేశం ఒకే ఎన్నికలు (one nation one election) అనే బిల్లును పాస్ చేయాలని ఎప్పటినుంచో కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో ఉంది. లోక్‌సభ ఎన్నికలు (lok sabha elections) దగ్గరపడుతున్న సమయంలో ఈ ఒకే దేశం ఒకే ఎన్నికల చట్టాన్ని ఎలా తీసుకురావాలి అనే విషయమై ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. ఈ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (ramnath kovind) నేతృత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ బిల్లును ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారు.
అసలు ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే ఏంటి?
మన దేశంలో ప్రతి ఐదుళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయన్న సంగతి తెలిసిందే. కాకపోతే కొన్ని రాష్ట్రాలు కాస్త ముందస్తు ఎన్నికలకు వెళ్తుంటాయి. మరికొన్ని రాష్ట్రాలు ఒకేసారి కలిసి ఎన్నికలకు వెళ్తుంటాయి. అలా కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరగాలన్నదే ఒకే దేశం ఒకే ఎన్నిక పాలసీ అజెండా. (one nation one election)
లాభాలేంటి?
ఇలా ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగడం ద్వారా ఎన్నికలకు అయ్యే ఖర్చు భారం చాలా వరకు తగ్గుతుంది. 2019 లోక్ సభ ఎన్నికలకు అయిన ఖర్చు అక్షరాలా రూ.60,000 కోట్లు. ఇది ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్‌కు, పోటీలో ఉన్న రాజకీయ పార్టీలకు అయిన ఖర్చు. ఇలా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల సాధారణంగా నిర్వహించే ఎన్నికల సమయంలో జరిగే ఇబ్బందులు తగ్గుముఖం పడతాయని అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పాలసీలు, ప్రోగ్రామ్‌లు కూడా నిర్విరామంగా సాగుతూ ఉంటాయని అంటున్నారు. సాధారణంగా ఏ రాష్ట్రంలో అయితే ఎన్నికలు జరుగుతాయో.. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కొత్త పథకాలు, పాలసీలు ప్రకటించడానికి వీల్లేదు. ఓటర్లకు కూడా వచ్చి ఓటు వేయడానికి వీలుగా ఉంటుందని.. ఓట్ల శాతం పెరిగే అవకాశం కూడా ఈ ఒకే దేశం ఒకే ఎన్నికల చట్టంతో ఉంటుందని అంటున్నారు. (one nation one election)
నష్టాలేంటి?
ఈ ఒకే దేశం ఒకే ఎన్నికల చట్టంతో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగపరంగా కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుంది. ఆ సవరణలు అసెంబ్లీ నియెజకవర్గాల నిబంధనలతో సింక్ అవ్వాలి. ఇతర పార్లమెంటరీ ప్రక్రియల్లో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ చట్టం వల్ల ప్రాంతీయ పార్టీలు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జాతీయ పార్టీల సమస్యల గురించే ఎక్కువగా వినిపించే అవకాశం ఉంటుంది కానీ స్థానికంగా ఉండే సమస్యల గురించి గళం వినిపించే వీలు ఉండదు. అంతేకాదు జాతీయ పార్టీలు పోటీ పడినట్లు ప్రాంతీయ పార్టీలు పడలేవు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే దేశంలోని 77% మంది ఓటర్లు ఒకే పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంటుంది. మిగిలిన పార్టీలు గెలిచే అవకాశం ఉండదు అని 2015లో IDFC ఇన్‌స్టిట్యూట్ చేపట్టిన సర్వేలో తేలింది.
1967 వరకు ఇదే రూల్
1967 వరకు ఎన్నికల కమిషన్ అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికలకు ఒకేసారి నిర్వహిస్తూ వచ్చింది. 1970కి వచ్చేసరికి ఎన్నో మార్పులు చేర్పుల కారణంగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వేరు వేరు సందర్భాల్లో జరుగుతూ వస్తున్నాయి. 1983లో మళ్లీ పాత పద్ధతినే తీసుకురావాలని ఎన్నికల కమిషన్ భావించింది కానీ అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇందుకు ఒప్పుకోలేదు. అలా ఇప్పటివరకు ఇదే ప్రక్రియ ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం మళ్లీ పాత పద్ధతినే తీసుకురావాలని అనుకుంటోంది.(one nation one election)
ఎవరికి ఇష్టం లేదు?
దాదాపు BJPకి సపోర్ట్ చేయని పార్టీలన్నింటికీ ఈ ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లు తీసుకురావడం ఇష్టం లేదు. కొన్నేళ్ల క్రితం ఈ బిల్లు గురించి చర్చించేందుకు మోదీ ఇతర పార్టీల నేతలను ఆహ్వానించారు కూడా. కానీ తృణమూల్ కాంగ్రెస్, TDP, కాంగ్రెస్, ఆప్ పార్టీలు సమావేశానికి హాజరుకాలేదు.