Telangana Elections: KCR రేవంత్‌కి పోటీగా కొత్త అభ్యర్ధి.. ఎవరితను?
Telangana Elections: ఈసారి ఎన్నికల్లో కామారెడ్డి (kamareddi) నుంచి బరిలోకి KCR, రేవంత్ రెడ్డి (revanth reddy) దిగనున్నారు. దాంతో ఈసారి తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఇది కాదు.
KCR, రేవంత్‌కు పోటీగా BJP అభ్యర్ధి బరిలోకి దిగారు. ఇందులో కొత్తేముంది? ఏ పార్టీ అయినా పోటీ చేయచ్చు కదా అనుకుంటున్నారా? అది కరెక్టే కానీ BJP నుంచి కామారెడ్డిలో బరిలోకి దిగింది ఇది వరకు ఎప్పుడూ పోటీ చేసింది లేదు. ఆ అభ్యర్ధి పేరు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి (katipally venkataramana reddy). ఇద్దరు కీలక నేతలు అయిన KCR, రేవంత్ రెడ్డిలను ఎలాగైనా ఓడించాలని వెంకటరమణ రెడ్డి తెగ కృషి చేసేస్తున్నారు. సింగిల్ హ్యాండ్‌తో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. కామారెడ్డిలో 2,45,822 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో మగవారు 1,18,718 మంది ఆడవారు 1,27,080.
అయితే స్థానికులు చెప్తున్నదానిని బట్టి చూస్తే వెంకటరమణ రెడ్డి ఎప్పుడు అవసరం ఉన్నా అందుబాటులో ఉండేవారని ఆయనకు కామారెడ్డిలో పాపులారిటీ బాగానే ఉందని చెప్తున్నారు. వెంకటరమణ రెడ్డి తన రాజకీయ ప్రయాణాన్ని నిజామాబాద్ ZPTCగా మొదలుపెట్టారు. అప్పటి ఆయన TRSలో (BRS) ఉన్నారు. వెంకటరమణ రెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమాని. అందుకే BRS నుంచి YSRCPలోకి వెళ్లారు. ఆ తర్వాత BJPలో చేరారు.
వెంకటరమణ రెడ్డి తండ్రి రాజి రెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచి ప్రజాదరణ పొందారు. గత మూడేళ్లుగా వెంకటరమణ రెడ్డి BJPతో ఉంటున్నారు. కామారెడ్డికి చెందిన అంగన్వాడి వర్కర్లకు సరైన వేతనాలు రావడంలేదని గళమెత్తిన నేత వెంకటరమణ రెడ్డి. దీంతో పాటు కామారెడ్డి మున్సిపాలిటీలోకి ఇతర ప్రాంతాల వారిని కలపాలన్న మాస్టర్ ప్లాన్‌ను తిప్పికొట్టారు. దాంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అలా వెంకటరమణ రెడ్డికి ప్రజల మద్దతు లభించింది.
ఇంతవరకు బాగానే ఉంది కానీ.. రేవంత్ రెడ్డి, KCR రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ కామారెడ్డి నుంచి బరిలో ఉన్నప్పటికీ.. వీరి నియోజకవర్గాలు కొడంగళ్, గజ్వేల్. ఒకవేళ ఈ రెండు నియోజకవర్గాల్లో ఇద్దరూ గెలిస్తే కామారెడ్డిలో ఎవరు గెలిచినా ఆ సీటును ఖాళీ చేయాల్సిందే. అప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు ప్రజలు ఇదే అంశంపై చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. అలా చూస్తే వారి ఓట్లు వెంకటరమణ రెడ్డికే పడేలా ఉన్నాయి. ఎందుకంటే వెంకటరమణ రెడ్డి కామారెడ్డి నుంచి మాత్రమే బరిలో ఉన్నారు. ఓడినా గెలిచినా ఆయన కామారెడ్డిలోనే ఉంటారు.