AP Assembly: ఎన్నికల ముందు అసెంబ్లీ నుంచి ఔట్!
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కలకలం రేగింది. స్పీకర్ తమ్మినేని సీతారామ్ (Thammineni Seetharam) ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) ముందు ఎనిమిది మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసారు. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నుంచి నలుగురు ఎమ్మెల్యేలను, YSRCP నుంచి నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు పడింది.
ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఇరు పార్టీ బలమైన సాక్ష్యాధారాలు సమర్పించారని న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తానని స్పీకర్ తమ్మినేని సీతారాం గతంలో ప్రకటన చేసారు. అనంతరం వారిపై అనర్హత వేటు వేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసారు. మరో పది పదిహేను రోజుల్లో సాధారణ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేస్తూ నోటీసులు జారీ చేసారు. (AP Assembly)
తెలుగు దేశం పార్టీ నుంచి
వల్లభనేని వంశీ
కరణం బలరాం
వాసుపల్లి గణేష్ కుమార్
మద్దాలి గిరి
YSRCP నుంచి
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ఆనం రామనారాయణ రెడ్డి
ఉండవల్లి శ్రీదేవి
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
అయితే వీరి అనర్హత వల్ల పెద్దగా జరిగే నష్టం ఏమీ లేదు.. అదే సమయంలో కేవలం YSRCPకి చెందినవారిపైనే అనర్హత వేటు వేస్తే అది పక్షపాతం వహించినట్లుగా భావించాల్సి ఉంటుంది కాబట్టి ఇరు పార్టీల పట్ల సమ న్యాయం పాటించాలన్న ఉద్దేశంతో రెండు వైపుల నుంచి ఎమ్మెల్యేల నుంచి అనర్హత వేటు వేసారు. ముఖ్యంగా YSRCPకి సంబంధించిన ఎమ్మెల్యేలపై ఆ పార్టీ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు గతంలోనే ఫిర్యాదు చేసారు. వారు పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసారని అప్పట్లోనే ముదునూరి ప్రసాద్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేసారు.
ALSO READ: AP Elections: 9 సీట్లకు BJPతో డీల్ ఓకే..?!
ఆ ఫిర్యాదుకు సంబంధించిన అన్ని ఆధారాలను సమర్పించారని దీనికి సంబంధించిన వీడియో, ఆడియో టేపులను కూడా స్పీకర్‌కు అందించినట్లు తెలుస్తోంది. మరో వైపు తెలుగు దేశం పార్టీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. తెలుగు దేశం పార్టీ తరఫున విప్‌గా ఉన్న బాలవీరాంజనేయ స్వామి.. వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్, మద్దాలి గిరిలపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రెండు ఫిర్యాదులు స్వీకరించిన స్పీకర్ అనేక మార్లు వారిని విచారణకు పిలిచినప్పటికీ కొంత మంది లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. మరికొందరు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు.
అయితే ఈ ఎనిమిది మందిపై అనర్హత వేటు వేస్తూ నిన్న అర్థరాత్రి ప్రకటన విడుదల చేసారు. అయితే ఈ అనర్హత పిటిషన్లు కూడా ఇప్పటివరకు కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచినప్పటికీ ఒక్కసారిగా తెరపైకి తీసుకురావడానికి ప్రధాన కారణం రాజ్య సభ ఎన్నికలనే చెప్పాలి. తెలుగు దేశం పార్టీ తమ అభ్యర్ధిని నిలబెడుతుందన్న సందేహంతోనే ఈ అనర్హత పిటిషన్‌ను తెరపైకి తీసుకొచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో అటు తెలుగు దేశం పార్టీ నుంచి వైసీపీలోకి మారిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ దాఖలు చేయడంతో ఇరు పార్టీలకు సంబంధించిన ఎనిమిది మందిపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
ఒకవేళ నిర్ణయం తీసుకోకుండా పిటిషన్‌ను కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టడం బాగోదని భావించి సమన్వయం పాటించాలని స్పీకర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆనం రామనారాయణ రెడ్డి స్పీకర్‌ని కలిసినప్పుడు స్పీకర్‌ను గట్టిగా ప్రశ్నించిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. గంటా శ్రీనివాస్ రావుకు రెండు గంటలకు పైగా సమయం ఇచ్చారు కానీ తమకు ఎందుకు ఇవ్వరు అని అడిగారు. మూడుసార్లు పిలిచిన తర్వాత రాకపోతే అనర్హత వేటు వేసే హక్కు తనకు ఉంటుందని ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం తెలిపారు.