AP Elections: ఎన్నిక‌ల బ‌రిలో 6 మాజీ ముఖ్య‌మంత్రుల వార‌సులు!

AP Elections: ఈసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల బ‌రిలో ఆరుగురు మాజీ ముఖ్య‌మంత్రుల వార‌సుల పోటీ ప‌డ‌నున్నారు. వారెవ‌రంటే..

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి (YS Rajasekhar Reddy) కుమారుడైన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఈసారి జ‌ర‌గ‌బోయే ఎన్నికల్లో 175కి 175 గెలిచి రెండో సారి అధికారంలోకి రావాల‌ని కృషి చేస్తున్నారు. ఈసారి కూడా జ‌గ‌న్ పులివెందుల నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.

నారా లోకేష్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయకుడు, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కుమారుడైన నారా లోకేష్ (Nara Lokesh) ఈసారి కూడా మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేయ‌నున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో లోకేష్ మంగ‌ళ‌గిరిలో పోటీ చేసి ఓడిపోయారు.

నంద‌మూరి బాల‌కృష్ణ‌

ఇక న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) ఓప‌క్క రాజ‌కీయాలు మ‌రోప‌క్క సినిమాల‌తో బిజీ బిజీగా ఉంటున్నారు. హిందూపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి గెలుస్తూ వ‌స్తున్న బాల‌య్య ఈసారి కూడా హిందూపూర్ నుంచే బ‌రిలోకి దిగ‌నున్నారు. బాల‌య్య తండ్రి దివంగ‌త న‌టుడు, మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు (NTR) అన్న సంగ‌తి తెలిసిందే. హిందూపూర్‌లో ఎన్టీఆర్ కుటుంబానికి తిరుగులేని అభిమానం ఉంది. గ‌తంలో నంద‌మూరి తార‌క రామారావు గెలిచి పోటీ చేయ‌గా.. ఆ త‌ర్వాత బాల‌య్య సోద‌రుడు, దివంగ‌త న‌టుడు హ‌రికృష్ణ కూడా ఇక్కడి నుంచి ప్ర‌చారం చేసారు. (AP Elections)

ALSO READ: Janasena కు మ‌ళ్లీ మొదలైన చిక్కులు!

నాదెండ్ల మ‌నోహ‌ర్

జ‌న‌సేన పార్టీకి పెద్ద దిక్క‌గా ఉంటూ జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వెన్నెముక‌గా నిలుస్తూ వ‌చ్చిన నాదెండ్ల మ‌నోహ‌ర్ తండ్రి నాదెండ్ల భాస్క‌ర్ గ‌తంలో తెలుగు దేశం పార్టీ త‌ర‌ఫున ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మ‌నోహ‌ర్ రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెనాలి నుంచి పోటీ చేయ‌నున్నారు.

రామ్‌కుమార్ రెడ్డి

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి జ‌నార్ధ‌న్ రెడ్డి కుమారుడైన రామ్‌కుమార్ రెడ్డి ఈసారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేయ‌నున్నారు. ఆయ‌న వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌నున్నారు.

సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మ‌యంలో ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన వారిలో కే. విజ‌య భాస్క‌ర్ రెడ్డి కూడా ఒక‌రు. ఆయ‌న కుమారుడు సూర్య ప్ర‌కాశ్ రెడ్డి ఇప్పుడు ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తున్నారు. తెలుగు దేశం పార్టీ త‌ర‌ఫున‌ డోన్ సీటు నుంచి ఆయన బ‌రిలో దిగ‌నున్నారు.