భాగస్వామితో సెక్స్ గురించి మాట్లాడలేకపోతున్నారా?
Lifestyle: దేశ జనాభా దాటిపోతోంది. అయినా చాలా మందికి శృంగారం గురించి మాట్లాడుకోవాలంటే బిడియం. భార్యాభర్తలు, ప్రేమికులు.. తమకున్న శృంగార సమస్యల గురించి ఒకరితో ఒకరు చెప్పుకోకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని అంటున్నారు నిపుణులు. సమస్య ఉంటే వైద్యలను కూడా సంప్రదించలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పటికి కూడా శృంగార సమస్యను బయటికి చెప్పకూడని అంశంగా భావిస్తున్నవారు ఇంకా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 43% మహిళలు, 31 శాతం పురుషుల్లో ఏదో ఒక శృంగార సమస్య ఉండనే ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కానీ వీరు మాత్రం తమ భాగస్వామ్యులతో కానీ నిపుణులతో కానీ ఆ అంశం గురించి చర్చించలేకపోతున్నారు.
శృంగార ఆరోగ్యం గురించి ఇప్పటికే OMG 2, డాక్టర్ జీ అనే సినిమాల్లో చూపించారు. సెక్స్ సమస్యల గురించి నిపుణులతో కానీ భాగస్వామ్యులతో కానీ చర్చించడంలో తప్పు ఎంత మాత్రం లేదని ఆ సినిమాల్లో బల్లగుద్ది చెప్పారు. ఈ సెక్స్ సమస్యల విషయంలో నిపుణులు కూడా పేషెంట్లతో ఫ్రెండ్లీగా వ్యవహరిస్తూ ఇది కూడా సాధారణ అనారోగ్య సమస్య లాంటిదే అన్న భరోసా కల్పిస్తే మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉంటుందని అంటున్నారు క్యూరెక్స్ సంస్థ అధినేత అనితా శ్యాం. క్యూరెక్స్ సంస్థ ద్వారా సెక్సువల్ సమస్యలతో బాధపడుతున్నవారికి సరైన అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. దీని వల్ల కొంత మందికి అవగాహన కలిగినా కూడా తాము విజయం సాధించినట్లే అని అనిత తెలిపారు.
చాలా మంది భార్యాభర్తలు కూడా తమకు ఏవైనా సందేహాలు, సమస్యలు ఉంటే కూడా ఒకరితో ఒకరు చెప్పుకోలేకపోతున్నారట. చెప్తే ఎక్కడ హేళన చేస్తారో ఎక్కడ విడాకులు ఇచ్చేస్తారో ఎక్కడ దూరం పెడతారో అన్న భయంతో తమలో తామే కుంగిపోతున్నారు. ఇలాగైతే ఆరోగ్యకరమైన శృంగారానికి దూరమై అసాంఘక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందు భార్య లేదా భర్తతో ఈ విషయాన్ని చర్చించి ఆ తర్వాత వైద్యులను సంప్రదిస్తే ఏ సమస్యా ఉండదు. అలాకాకుండా తమలో తామే ఈ సమస్యను దాచిపెట్టి పైకి అంతా బాగానే ఉన్నట్లు నటిస్తే మాత్రం మొదటికే మోసం అని నిపుణుల హెచ్చరిక.