Lifestyle: కొలీగ్‌తో ప్రేమ‌.. అస్స‌లొద్దంటున్న నిపుణులు

never date a person from your work place

Lifestyle: చాలా మందికి ఆఫీస్‌లో ప‌నిచేస్తున్న కొలీగ్స్‌తో స్నేహం ఏర్ప‌డి అది ప్రేమ‌కు దారి తీస్తుంది. అయితే ఆఫీస్‌లో ప్రేమ‌లు ఎఫైర్ల జోలికి వెళ్ల‌ద్దు అని అంటున్నారు రిలేష‌న్‌షిప్ నిపుణులు. అలా ఎందుకు అంటున్నారో తెలుసుకుందాం.

వ‌ర్క్ దెబ్బ‌తింటుంది

ఆఫీస్‌లోని కొలీగ్‌తో ప్రేమ‌లో ప‌డ్డారంటే ముందు ప్ర‌భావం ప‌డేది మీ వర్క్‌పైనే. ఎందుకంటే ప‌దే ప‌దే మీ పార్ట్‌న‌ర్‌తో మాట్లాడాలి అనిపిస్తుంది. వారిని త‌దేకంగా చూస్తూ వారి ఆలోచ‌న‌ల్లోనే మునిగిపోతారు. మేనేజ‌రో టీం లీడో వ‌చ్చి అస‌లు నువ్వేం వ‌ర్క్ చేస్తున్నావ్ అనే మాట వ‌చ్చేంత వ‌ర‌కు ప‌నిని నిర్లక్ష్యం చేస్తున్న‌ది కూడా తెలీదు.

న‌లుగురి చూపూ మీ వైపే

మీరు మీ కొలీగ్‌తో ప్రేమ‌లో ఉన్నార‌ని ఆఫీస్‌లో ఒక్కరికి తెలిసినా చాలు. అది మొత్తం కంపెనీకి పాకేస్తుంది. అప్పుడు మీరు మీ పార్ట్‌న‌ర్‌తో వ‌ర్క్ గురించి మాట్లాడుతున్నా కూడా త‌ప్పుగా చూస్తారు. మీరు అలా వాష్‌రూంకి వెళ్లినా టీ తాగ‌డానికి వెళ్లినా న‌లుగురి చూపూ మీ వైపే ఉంటుంది. పైగా మీ గురించి త‌ప్పుగా అనుకునే అవ‌కాశం లేక‌పోలేదు. ఇది మేనేజ‌ర్, హెచ్ఆర్ వ‌ర‌కు వెళ్తే అంతే సంగ‌తులు.

మిమ్మ‌ల్ని తొక్కేయాల‌ని చూస్తారు

ఆఫీస్‌ల‌లో మ‌న‌కు గిట్ట‌ని వారు ఎవ‌రో ఒక‌రు ఉంటారు. మీరు మీ కొలీగ్‌తో ప్రేమ‌లో ఉన్నార‌ని మీకు గిట్ట‌ని వారికి తెలిసింద‌నుకోండి.. వారు ఈ పాయింట్‌ను వాడుకుని మిమ్మ‌ల్ని తొక్కేయాల‌ని చూస్తుంటారు. ప్ర‌మోష‌న్స్, హైక్స్ స‌మ‌యంలో మీ గురించి పై వారికి త‌ప్పుగా చెప్పి మీకు ద‌క్కాల్సిన‌వి ద‌క్క‌నివ్వ‌కుండా చేస్తారు.

పైన చెప్పిన‌వి కొంద‌రి జీవితాల్లో జ‌ర‌గ‌చ్చు.. జ‌ర‌గ‌క‌పోవ‌చ్చు. కాక‌పోతే ఇవ‌న్నీ స‌హ‌జంగా జ‌రుగుతున్న‌వే అని ఓ నివేదికలో పేర్కొన‌డంతో ఆఫీస్‌లో ప్రేమ వ్యవ‌హారాల‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.