Lifestyle: పక్కింటావిడ ఏ సాయం కావాలన్నా మా ఆయన్నే అడుగుతోంది
Lifestyle: మా పక్కింట్లోకి ఓ మహిళ కొత్తగా వచ్చింది. ఆమెకు విడాకులయ్యాయట. అయితే వచ్చిన రోజు నుంచి ఏం కావాలన్నా నన్ను అడగకుండా నా భర్తనే అడుగుతోంది. నా భర్త కూడా పలికి సాయం చేస్తున్నాడు. కానీ ఆమె ప్రవర్తన నాకు నచ్చడంలేదు. ఇంట్లో నేను కూడా ఉన్నాను కదా. నన్ను అడగకుండా మా వారిని అడగటం ఏంటి? ఈ విషయంపై చాలా కోపం వస్తోంది. మా ఆయన్ని అడిగితే బాధపడతారేమో అని భయంగా ఉంది. ఏదన్నా సలహా ఇవ్వగలరు.
సైకాలజిస్ట్ రజనా అవాత్రమాని సలహా
భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం, నమ్మకం ఉండాలి. అనుమానం అనే పదానికి చోటు ఉండకూడదు. ఇక మీ విషయంలో మీరు పడుతున్న బాధ అర్థం చేసుకోగలను. మంచికి పోతే చెడు ఎదురయ్యే రోజులివి. పైగా ఈరోజుల్లో కొందరు మగవారు, ఆడవారు ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. మీరు ఒక పని చేయండి. ఆవిడకు ఏదన్నా సాయం కావాలంటే మీ భర్త కంటే ముందు మీరే వెళ్లి ఆమెకు కావాల్సినవి ఏంటో చూడండి. తోడు ఎవ్వరూ లేకపోవడంతో ఆమెకు సాయం చేయాలని మీ భర్త అనుకుని ఉంటారు. అందులో తప్పేమీ లేదు. కానీ ఈరోజుల్లో ఎవ్వరినీ నమ్మడానికి లేదు. ఈ విషయాన్ని మీ భర్తకు అర్థమయ్యేలా చెప్పండి. ఆమె మరీ మిమ్మల్ని విసిగిస్తుంటే డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ అని చెప్పేయండి. ఆవిడ నిజంగానే అవసరం కోసం సాయం అడుగుతుంటే మాత్రం మీరే వెళ్లి హెల్ప్ చేయండి. ఇలా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు.