Lifestyle: నా భార్య పిల్లల్ని పట్టించుకోవడం లేదు.. ఏం చేయమంటారు?
Lifestyle: మాకు ఇద్దరు పిల్లలున్నారు. కానీ నా భార్య అసలు పిల్లల్ని పట్టించుకోవడం లేదు. ఎప్పుడు చూసినా వారిని నాతో వదిలేసి తను తన స్నేహితురాళ్లతో ట్రిప్స్‌కి వెళ్లిపోతుంది. ఇలా చాలా కాలంగా జరుగుతోంది. నలుగురి ముందు మాత్రం నా లాంటి తండ్రి దొరకడం పిల్లల అదృష్టం అని అంటుంది. అది విని నేను ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతున్నాను. నాకు నా పిల్లలంటే ప్రాణం. అలాగని వారిని ఒక్కోసారి చూసుకోవడం నా ఒక్కడి వల్ల కావడంలేదు. ఏం చేయమంటారు?
నిపుణుల సలహా: మీరు మీ భార్య ఉద్యోగాలు చేస్తున్నారా లేదా అనే విషయం మాత్రం చెప్పలేదు. మీ భార్య ట్రిప్స్‌కి ఎక్కువగా వెళ్తుంది అంటున్నారంటే ఆమె ఖాళీగానే ఉంటారని తెలుస్తోంది. మరి మీ విషయం ఏంటి? మీరు పిల్లల్ని చూసుకుంటున్నారంటే మీకు ఉద్యోగం లేదా? లేదా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా? ఈ విషయం పక్కనబెడితే.. మీ భార్య మీతో పిల్లలతో ఎలా ఉంటుందో చెప్పలేదు. ఒకవేళ ఆమెకు మీతో పిల్లలతో ఉండటం ఇష్టం లేక అలా వెళ్లిపోతోందేమో..!
నలుగురిలో మిమ్మల్ని పొడిగినప్పుడు మౌనంగా ఉండాల్సి వస్తోంది అంటున్నారు. ఆ నలుగురు లేనప్పుడు మీ భార్యతో ఈ విషయం గురించి ప్రస్తావించారా? అసలు ఎప్పుడైనా మీకున్న సమస్యను చెప్పారా? మీరు ఏమీ అడగకుండా మౌనంగా ఉంటే మీరు కూడా మీ భార్య అలా ట్రిప్స్‌కి వెళ్లడాన్ని సహకరిస్తున్నట్లే అనిపిస్తోంది. ఒకసారి నేరుగా అడిగి చూడండి. ఎందుకు ఇంటి పట్టున ఉండటం లేదు.. ఎందుకు పిల్లల్ని చూసుకోవడం లేదు అని కాస్త నిదానంగా అడిగి చూడండి. అప్పుడు తనకు తన తప్పేంటో తెలుస్తుంది. ఒకవేళ మీ ఆవిడకు మీతో ఉండటం ఇష్టం లేకపోతే ఎందుకో కూడా అడిగి తెలుసుకోండి. కౌన్సిలింగ్ ఇప్పించి చూడండి. ఆల్ ది బెస్ట్.