Lifestyle: నా భార్యకు HIV ఉందన్న విషయం దాచింది
Lifestyle: “”” హాయ్ ఫ్రెండ్స్, నాకు ఎదురైన అనుభవం గురించి మీకు చెప్పుకోవాలనిపించింది. ఇది చదివి నాలాగా మోసపోకుండా ఉంటారని ఆశిస్తున్నాను. నాకు అమ్మానాన్న అంటే ఎంతో గౌరవం, ప్రేమ. వారు తెచ్చిన సంబంధాన్నే చేసుకోవాలనుకున్నాను. అందుకే ప్రేమ జోలికి పోదలచుకోలేదు. ఓసారి అమ్మానాన్నలు ఓ సంబంధం తెచ్చారు. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది. పెళ్లి చూపులకు వెళ్లినప్పుడు ఆ అమ్మాయి కాస్త కంగారుగా కనిపించింది. ఇలాంటి సమయంలో అది ఏ ఆడపిల్లకైనా ఉంటుంది అని నేను పట్టించుకోలేదు. ఇద్దరికీ ఒకరికొకరం నచ్చాం. కాసేపు మాట్లాడుకున్నాక మాకు పెళ్లికి ఓకే అని చెప్పాం. అలా ఉన్నంతలో మా పెళ్లి జరిగింది. వాళ్లు తెచ్చిన సంబంధం చేసుకున్నందుకు అమ్మానాన్నలు ఇంకా హ్యాపీ. అంతకంటే నాకేం కావాలి అనిపించింది.
పెళ్లైన మూడు నెలల వరకు నేను నా భార్యతో కలవలేదు. ఎందుకంటే అప్పుడే పిల్లలు వద్దనుకున్నాం. కానీ ప్రొటెక్షన్తో కలవాలని అనుకున్నాను. ఇదే విషయం గురించి నా భార్యకు చెప్తే వద్దు అంది. నాకు అర్థంకాలేదు. ప్రొటెక్షన్ వాడతాం కదా ఎందుకు వద్దంటోందో తెలీక అడిగితే ఏమీ చెప్పలేదు. పైగా కంగారుపడుతోంది. ఒంట్లో బాలేదేమో అనుకున్నాను. ఎప్పుడు అడిగినా ఇలాగే ప్రవర్తిస్తోంది. ఓసారి నేనే ఒంటరిగా కూర్చుపెట్టి సమస్య ఏంటో అడిగి తెలుసుకోవాలనుకున్నాను. ఎంతో అడిగి అడిగి వేడుకుంటే నా గుండె బద్ధలయ్యే విషయం చెప్పింది. తనకు హెచ్ఐవి ఉందని. అది విని ఒక్క క్షణం నా గుండె ఆగినంతపనైంది.
ఈ విషయం పెళ్లికి ముందే చెప్పనందుకు నాకు వచ్చిన కోపానికి చంపాలనే అనిపించింది. కానీ తనను ఒక్క మాట కూడా అనలేకపోయాను. కారణం.. తప్పు తనది కాదు. మా అమ్మానాన్నలది, అమ్మాయి తల్లిదండ్రులది. పెళ్లికి ముందు ఈ మ్యాటర్ ఎందుకు చెప్పలేదు అని నేరుగా ఆ అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లి నిలదీసాను. నా స్థానంలో ఇంకొకరు ఉంటే నేరుగా పోలీసులను తీసుకెళ్తారు. కానీ నేను ఆ పని చేయలేదు. నేను కేకలు వేస్తుంటే చుట్టుపక్కల వాళ్లు వింటారు బాబు అంటూ నా నోరు నొక్కేందుకు ప్రయత్నించారు.
దాంతో మరింత రెచ్చిపోయా. నా కోపాన్ని చూసి వాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓసారి అనారోగ్యం కారణంగా ఓ హాస్పిటల్కు తీసుకెళ్తే రక్తం ఎక్కించారని.. ఆ తర్వాతే అది ఇన్ఫెక్షన్ సోకిన రక్తమని తెలిసిందని వారు చెప్పారు. ఇందులో వారి తప్పేమీ లేదు. మరి నాకు ఎందుకు చెప్పలేదు? అని నిలదీసాను. ఈ విషయంలో తమ తప్పు లేకపోయినా పెళ్లి సంబంధాలు వచ్చి ఆగిపోతున్నాయని చెప్పలేదని అన్నారు. మరి నా పరిస్థితి ఏంటి? నేనేం తప్పు చేసానని నాకు ఇంత శిక్ష. ఇప్పుడు నేను తనకు విడాకులు ఇవ్వాలా వద్దా అనేది కూడా నిర్ణయించుకోలేకపోతున్నా. అమ్మానాన్నలకు ఈ విషయం తెలీదు. తెలిస్తే వారి పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయం వేస్తోంది.
నా విషయంలో జరిగింది మాత్రం అన్యాయమనే చెప్పాలి. బహుశా నా భార్య నాతో ఈ విషయాన్ని పెళ్లికి ముందు చెప్పి ఉంటే ఒప్పుకునేవాడిని ఏమో. కానీ చెప్పలేదు అనే విషయం నన్ను లోలోపలే తినేస్తోంది. ఇంకా పిల్లలు పుట్టలేదు కాబట్టి మరీ మంచిది అనిపించింది. తనకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయం తనకు చెప్తే తప్పు నాదే కాబట్టి మీరు ఏ శిక్ష వేసినా భరిస్తాను అంటోంది. ఇప్పుడు ఇంత మాట్లాడుతోంది. మరి పెళ్లికి ముందు నోరు పడిపోయిందా? విడాకులు ఇచ్చాక రెండో పెళ్లి చేసుకోవాలంటే అప్పుడు ఎలాంటి అమ్మాయి వస్తుందో అని మరో భయం కూడా ఉంది. ఏం చేయాలో తెలీక సతమతమవుతున్నాను. ఇలాంటి కష్టం ఎవ్వరికీ రాకూడదని ఆశిస్తున్నాను“”” – ఓ సోదరుడు