Lifestyle: నా భార్య అందరి ముందు అవమానిస్తోంది.. స్థోమతకు మించినవి కావాలంటోంది.. ఏం చేయాలి?
Lifestyle: నా భార్య అందరి ముందు నన్ను అవమానిస్తోంది. అందుకు కారణం ఆమె అడిగినదల్లా నేను కొనడం లేదని. నాకు వచ్చే జీతానికి ఇల్లు గడవడమే కష్టంగా ఉంటుంది. అది అర్థంచేసుకోకుండా స్థోమతకు మించిన కోరికలు కోరుతోంది. నేను ఆ కోరికలు తీర్చలేకపోతే ఎందరూ పనికిరావు… నా స్నేహితురాళ్ల భర్తలను చూసి నేర్చుకో అని నలుగురి ముందు నన్ను అవమానిస్తోంది. ఓసారి నాపై చేయిచేసుకుంది కూడా. నన్నేం చేయమంటారు?
నిపుణుల సలహా
ఇది నిజంగా బాధాకరమైన విషయం. మీరు చెప్పిన దానిని బట్టి చూస్తే మీ భార్య ఎలాంటి ఉద్యోగం చేయడంలేదు అని అర్థమవుతోంది. ఈరోజుల్లో భార్యాభర్తలు కలిసి సంపాదిస్తున్నా ఆకాశాన్ని తాకుతున్న ధరలను అందుకోలేని పరిస్థితి. వీలైతే మీ భార్యను కూడా ఏదన్నా ఉద్యోగం చేయమనండి. కష్టపడి సంపాదిస్తే తప్ప దాని విలువ ఏంటో మనిషికి అర్థం కాదు. ఒకవేళ మీ భార్యకు ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే.. స్థోమతకు మించిన అవసరాలను తీర్చుకోలేం అని కూడా నచ్చజెప్పండి. మెయిల్‌లో మీకు పిల్లలు ఉన్నారో లేదో అనేది రాయలేదు.
ఒకవేళ మీకు పిల్లలు ఉంటే వారి చదువులకు అయ్యే ఖర్చుల గురించి తెలియజేయండి. ఇవన్నీ చెప్పినా ఆమె అర్థంచేసుకోకుండా ఇలాగే ప్రవర్తిస్తుంటే మీ ఇంటి పెద్దల ద్వారా చెప్పించండి. అయినప్పటికీ మార్పు రాకపోతే కౌన్సిలింగ్‌కి వెళ్లండి. మీ ఆవిడ మిమ్మల్ని కొట్టేదాకా వచ్చిందంటే సమస్య చేయి దాటిపోయినట్లే అనిపిస్తోంది. ఎంత చేసినా మీ భార్య తీరు మారకపోతే విడాకులకు అప్లై చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇలాంటి అంశాలు మనిషిని మానసికంగా కుంగదీస్తుంటాయి. మన బాధలను పట్టించుకోలేని వారితో మనల్ని అర్థంచేసుకోలేని వారితో ఉండటంలో అర్థం లేదు. ఏం చేసినా ఒకటికి పది సార్లు ఆలోచించి చేయండి. ఆల్ ది బెస్ట్.