Lifestyle: పెళ్లయ్యేవరకు తనతో ఉండాలంటున్నాడు
Lifestyle: నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. కానీ వాళ్లింట్లో కులం వల్ల ఒప్పుకోవడం లేదు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేదని తెలిసిపోయింది. ఇప్పుడు నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఒక సంబంధం ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యేలా ఉంది. ఈ విషయం గురించి తనతో చెప్తే పెళ్లి అయ్యే వరకు తనతో ఉండాలి అంటున్నాడు. ఏం చేయాలి?
నిపుణుల సలహా
ఇది చాలా చిన్న ప్రశ్న. ఏం చేయాలో మీరు నిపుణులను కూడా అడగనవసరం లేదు. ఆలోచించే పరిపక్వత మీకు కచ్చితంగా ఉండే ఉంటుంది. మరో పెళ్లికి మీరు సిద్ధం అయ్యారు. తప్పు లేదు. అప్పటివరకు తనతో ఉండాలి అంటున్నాడంటే ఆ అబ్బాయి వ్యక్తిత్వం కాస్త తేడాగా అనిపిస్తోంది. ఈ రోజుల్లో ఎవరినీ నమ్మలేం. పెళ్లి సంబంధాలు కుదిరే విషయంలో చాలా మంది చాలా రకాలుగా పరిశీలిస్తుంటారు. మీ గురించి నలుగురిని అడిగి తెలుసుకుంటారు. ఆ సమయంలో మీ ఇద్దరి ప్రేమ విషయం పెద్దలకు తెలిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటూ ఆ అబ్బాయి ఇంట్లో పెళ్లికి ఒప్పుకోవడం లేదు. అలాంటప్పుడు ఆ బంధానికి బైబై చెప్పి హాయిగా పెద్దలు చూసిన సంబంధాన్ని చేసుకోండి. నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయి.