Lifestyle: పెళ్లయ్యాక సంసారానికి పనికిరాడని తెలిసింది
Lifestyle: “””” నాకు మా అమ్మానాన్నలు 25 ఏళ్లకే పెళ్లి చేసారు. ఉన్నంతలో మా పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లైన వారం రోజుల తర్వాత మేం హనీమూన్ కోసమని కేరళ వెళ్లాం. అక్కడ నా భర్త విచిత్ర తీరు చూసి నాకు ఆశ్చర్యం వేసింది. అలా చేతిలో చేతులు వేసుకుని సరదాగా నడుద్దాం రండి అని పిలిస్తే చూసేవాళ్లు ఏమనుకుంటారు అనేవాడు. నా భర్త చేతులు నేను పట్టుకుంటే వేరే వాళ్లకు వచ్చిన నష్టమేంటి అనుకున్నాను. కేరళ ట్రిప్ ఎంజాయ్ చేయకుండానే తిరిగి ఇంటికి వెళ్లిపోయాం.
ఇంటికి వెళ్లాక కూడా అదే తంతు. చెయ్యి పట్టుకున్నా కౌగిలించుకోవాలనుకున్నా అస్సలు ఒప్పుకునేవాడు కాదు. ఓసారి బైక్‌పై వెళ్తుంటే భుజంపై చెయ్యి వేసాను. ఆ మాత్రం దానికే బైక్ పక్కన ఆపేసి ఇక్కడ నాకు తెలిసిన వారు చాలా మంది ఉన్నారు నువ్వు ఇలా పట్టుకుంటే వాళ్లు తప్పుగా అనుకుంటారు అని కసిరాడు. నాకు అప్పుడే అర్థమైంది ఆయనలో ఏదో లోపం ఉందని. ఎలాగైనా మ్యాటర్ ఏంటో తెలుసుకుందామని సందర్భం కోసం ఎదురుచూస్తున్న నాకు ఆయన షాకిచ్చాడు.
నాకు మ్యాటర్ తెలిసిపోయిందని అనుకున్నాడో ఏమో.. నేరుగా మా ఇంటికి వెళ్లి మీ అమ్మాయిలో లోపం ఉంది ఇప్పటివరకు ఒక్కసారీ కలవలేదు అని చెప్పాడు. నా గురించి మా అమ్మానాన్నలకు తెలుసు కాబట్టి వారు ముందు నమ్మలేదు. మేం నచ్చజెప్తాంలే అల్లుడు గారు అని ఆయన్ను శాంతింపజేసారు. ఆ తర్వాత మా అమ్మానాన్నలు నన్ను పిలిచి ఒంటరిగా మాట్లాడాలి అన్నారు. అల్లుడుగారు నీలో లోపం ఉంది అంటున్నారు.. ఏంటి ఇదంతా అని నిలదీసారు. అప్పుడు నేను జరిగిన అనుభవాలను చెప్పి ఆయనలోనే మ్యాటర్ లేదు అని చెప్పాను.
అది విని వాళ్లు షాకయ్యారు. ఆ తర్వాత మా అత్తామామలను పిలిపించి విషయం చెప్తే వాళ్లు అవాక్కయ్యారు. ఇదేక్కడి గోల అంటూ తలపట్టుకున్నారు. అలా వివాహమైన మూడు నెలలకే నా కాపురం కూలిపోయింది. ఆయన విడాకులు కావాలన్నారు. కానీ తనలోని లోపాన్ని మాత్రం ఎవరికీ తెలియకూడదు అని కూడా చెప్పారు. నేనెందుకు నింద వేసుకోవాలి. అందుకే లాయర్‌కి ఉన్నది ఉన్నట్లు చెప్పా. ఆయన నా బాధ అర్థంచేసుకుని నా వైపే నిలబడ్డారు. కోర్టుల చుట్టూ తిరిగితే దాదాపు ఏడాదిన్నర తర్వాత మాకు విడాకులు మంజూరయ్యాయి.
బిడ్డ జీవితం ఇలా అయిపోయిందే అని మా అమ్మానాన్నలు బెంగపెట్టుకున్నారు. జాతకం చూపిస్తే సరైన ముహూర్తం పెట్టకుండా పెళ్లి చేసారు అని ఎవరో జ్యోతిష్యుడు చెప్పాడట. ఆ తర్వాత మరో మంచి సంబంధం చూసి పెళ్లి చేసారు. మా వారు చాలా మంచి వారు. నాతో ఎంతో ప్రేమగా ఉంటారు. త్వరలో మా ఇంటికి బాబో పాపో రానున్నారు. ఏం జరిగినా మంచికే అని పెద్దలు ఊరికే అనలేదు..! “”””