భార్యపై అనుమానం.. వేశ్యతో సంబంధం
Lifestyle: అనుమానం పెనుభూతం అని ఊరికే అంటారా..! ఈ అనుమానంతోనే తనను ఎంతో ప్రేమించే భార్యపై కోపంతో చేయకూడని అపరాధం చేసాడు ఓ వ్యక్తి. ఇప్పుడు తన భార్య ఎప్పుడెప్పుడు క్షమిస్తుందా అని రోజూ ఆమెను తలుచుకుంటూ కుమిలిపోతున్నాడు. ఏం జరిగిందో అతని మాటల్లోనే తెలుసుకుందాం.
“” హాయ్ ఫ్రెండ్స్. కొన్నిసార్లు జీవితంలో అన్నీ ఉన్నా కూడా మనం చేతులారా చేసుకునే కొన్ని పనుల వల్ల ఆ సంతోషకరమైన జీవితాన్ని తలకిందులు చేసుకుంటూ ఉంటాం అని చెప్పడానికి నా కథే ఉదాహరణ. నేను నా భార్య కాలేజ్ రోజుల్లోనే ప్రేమించుకున్నాం. మా పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడంతో ఎలాంటి గొడవ లేకుండా హాయిగా మా పెళ్లి. జరిగింది. మాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు. నా భార్య నేను ఎంతో సంతోషంగా ఉండేవాళ్లం. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. కానీ నా కర్మ కాలి నా భార్యపై అనుమానం పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు కారణం నా భార్య ఎప్పుడూ లేనిది ఇంటికి ఆలస్యంగా వస్తుండడం.. ఫోన్లో ఎక్కువగా చాటింగ్స్ చేస్తుండడమే. తను అలా ఎప్పుడూ లేదు. ఇప్పుడే ఎందుకు ఇలా ప్రవర్తిస్తోందో నాకు అర్థంకాలేదు. ఏమన్నా సమస్య ఉందా అని నేనే నేరుగా అడిగేసా. ఏమీ లేదు అంతా బానే ఉంది అని చెప్పింది. తను నాకు అబద్ధం చెప్పిందేమో అనిపించింది.
ఏదన్నా ఉంటే తనే చెప్తుందిలే అని సర్దుకుపోయా. ఓసారి నా భార్యకు వచ్చిన మెసేజ్ నా కంట పడింది. అందులో ఏం బాధపడకు. మీ భర్తకు ధైర్యంగా ఈ విషయం చెప్పు. అని రాసుంది. దానిని నేను తప్పుగా అర్థం చేసుకున్నా. ఆ మెసేజ్ చేసింది కూడా ఎవరో కాదు. మా ఇద్దరికీ తెలిసిన డాక్టర్. ఆ డాక్టర్‌కి నా భార్యకు ఎఫైర్ ఉందేమో అని నాకు ఎప్పటి నుంచో సందేహం ఉంది. ఆ ఒక్క మెసేజ్‌తో అది కన్ఫామ్ అయిపోయింది అనుకున్నాను. కనీసం ఏంటిది అని ఆమెను ఒక్కసారి కూడా అడగకుండా తనపై కోపంతో ఓ వేశ్య దగ్గరికి వెళ్లాను. ఆమెతో సంబంధం పెట్టుకున్నాను.
ఓసారి ఇంటికి ఆలస్యంగా వెళ్తే ఇంతసేపు ఎక్కడున్నావ్ అని నా భార్య అడిగింది. నువ్వు డాక్టర్‌తో కులికితే తప్పు లేదు కానీ నేను ఆలస్యంగా వస్తే తప్పా అని నోరుపారేసుకున్నాను. దాంతో నా భార్య కంట నీరు. నాకు మరింత ఒళ్లుమండిపోయింది. ఆ డాక్టర్‌తో నీకు ఎఫైర్ ఉంది కదా. అందుకే కదా రోజూ అతనితో మాట్లాడుతున్నావ్ అంటూ రెచ్చిపోయాను. అది విని ఆమె హతాశురాలైంది. ఆ తర్వాత నాకు అసలు విషయం తెలిసింది. నా భార్య మూడోసారి గర్భం దాల్చింది. మాకు ఇద్దరు పిల్లలు ఉన్న నేపథ్యంలో ఇక పిల్లలు వద్దు అనుకున్నాం. కానీ ఆమె మళ్లీ గర్భం దాల్చడంతో కాంప్లికేషన్స్ ఉన్నాయట. ఇదే విషయం గురించి డాక్టర్‌తో మాట్లాడుతోందట. నాకు తెలిస్తే ఎక్కడ బాధపడతానో అని చెప్పకుండా దాచిందట. ఈ విషయం తెలీక నేను మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాను. ఈ విషయం నా భార్యకు ఆలస్యంగా తెలిసింది. ఇప్పుడు తను నాతో లేదు. పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. విడాకులు ఇస్తా అంటోంది. నేను ఎంత బతిమాలినా ఒప్పుకోవడం లేదు. ఎప్పటికైనా తను నన్ను క్షమించి వస్తుందని ఆశ. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. రిలేషన్షిప్స్లో నమ్మకం అనేది ఎంత ముఖ్యమో కమ్యునికేషన్ అనేది మరింత ముఖ్యం. అది లేకపోవడం వల్లే నేను ఈ బాధలను కొనితెచ్చుకున్నాను “” – ఓ సోదరుడు