Health: చ‌ల్ల నీటితోనే స్నానం చేయాలా?

Health: కొంద‌రికి వేడిగా కాలిపోయే నీటితో స్నానం చేయ‌డం ఇష్టం. ఇంకొంద‌రికి వాతావ‌ర‌ణం ఎలా ఉన్నా చ‌ల్ల నీటితోనే స్నానం చేయ‌డానికి ఇష్ట‌ప‌డుతుంటారు. ఈ రెండింటిలో ఏ నీటితో స్నానం చేస్తే మంచిది అంటే.. చ‌ల్ల నీళ్లు అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు.

చ‌ల్ల నీటితో స్నానం చేస్తే శ‌రీరంలోని అన్ని భాగాల‌కు రక్త ప్ర‌స‌ర‌ణ బాగా జరుగుతుంద‌ని అంటున్నారు హైద‌రాబాద్ య‌శోద‌లో సీనియ‌ర్ క‌న్‌స‌ల్టెంట్ ఫిజీషియ‌న్‌గా ప‌నిచేస్తున్న‌ డాక్ట‌ర్ సోమ‌నాథ్‌. చ‌ల్ల నీటితో స్నానం చేయ‌డం వ‌ల్ల సర్వ రోగాల‌కు కార‌ణం అయిన ఇన్‌ఫ్ల‌మేష‌న్, గుండె సంబంధిత వ్యాధులు కూడా రావ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. రోగనిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతంద‌ట‌.

క్రీడాకారులు గాయాల‌పాలైన‌ప్పుడు, వ‌ర్క‌వుట్స్ చేసాక‌ కోల్డ్ వాట‌ర్‌తోనే స్నానం చేస్తుంటార‌ట‌. దీని వ‌ల్ల కండ‌రాల వాపు త‌గ్గుతుంది. చ‌ల్ల‌ని వ‌స్తువులు శ‌రీరానికి త‌గిలినప్పుడు ఒంట్లో ఉండే బ్రౌన్ అడిపోస్ టిష్యూ యాక్టివేట్ అవుతుంది. ఒంట్లో రెండు ర‌కాల కొవ్వులు ఉంటాయి. ఒక‌టి బ్రౌన్ ఫ్యాట్. మ‌రొక‌టి వైట్ ఫ్యాట్. వైట్ ఫ్యాట్ ఎన‌ర్జీని ఆదా చేస్తుంది. బ్రౌన్ ఫ్యాట్ వేడి పుట్టించి కేలొరీలు క‌రిగేలా చేస్తుంది. చ‌ల్ల‌ని నీటితో స్నానం చేసిన‌ప్పుడు న‌రాలు జివ్వుమంటాయి క‌దా.. అలా అనిపిస్తే మెద‌డులోని న‌రాలు ఉత్తేజితం అవుతాయి. మూడ్ కూడా బాగుంటుంది.

ఒక రీసెర్చ్‌లో వేడి నీటితో స్నానం చేసిన‌వారిలో కంటే చ‌ల్ల‌ని నీటితో స్నానం చేసిన వారికి స‌మ‌యానికి బాగా ప‌డుతోంద‌ట‌. శ‌రీరంపై ఉండే రంధ్రాలు కూడా మూసుకుపోతాయి. అవి తెరుచుకుని ఉంటే దుమ్ము ధూళి చేరి కురుపులు, యాక్నే వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. చ‌ల్ల నీళ్ల‌తో త‌ల‌స్నానం చేస్తే జుట్టు మెరుస్తుంది. రాల‌డం కూడా త‌గ్గుతుంది. అయితే క‌చ్చితంగా చ‌ల్ల నీటితో స్నానం చేయాల‌న్న రూల్ ఏమీ లేదు. ఆరోగ్యం బాగుండి చేయ‌గ‌లిగేవారు చేసుకోవ‌చ్చు.