తినేముందు మామిడి పండ్లను నానబెట్టాలా?

Hyderabad: ఎండాకాలం(Summer) వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా రకరకాల మామిడి పండ్లు(Mangoes) నోరూరిస్తూ ఉంటాయి. పండ్లల్లో రారాజుగా అందరూ ఇష్టపడే వీటికోసం వేసవి ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూసేవారుంటారనడంలో అతిశయోక్తి లేదు. ఇక, మామిడి పండ్లతో రసాలు, షేక్​లు, ఐస్​క్రీమ్​లు.. ఒక్కటేమిటి అన్ని వెరైటీలనూ చేసుకుని ఆరగించేస్తారు. అయితే మామిడి పండ్లను ఎక్కువగా తింటే ఒంట్లో వేడి చేస్తుందని నమ్ముతారు చాలామంది. దీనికి ప్రత్యామ్నాయంగా మామిడి పండ్లను నీటిలో(Water) నానబెడితే వాటిలోని వేడి తగ్గించవచ్చని అనుకుంటారు. అయితే నీళ్లలో మామిడి పండ్లను నానబెట్టడం వల్ల అలాంటిదేం జరగదంటున్నారు నిపుణులు.

సాధారణంగా ఏవైనా పండ్లను తినేటప్పుడు ఎక్కువ నీటితో శుభ్రంగా కడిగి తినడం మంచిది. అయితే మామిడి పండ్లను మాత్రం కాసేపు చల్లని నీటిలో నానబెట్టడం, ఫ్రిజ్​లో పెట్టడం వంటి వాటివల్ల దానిలో వేడి చేసే గుణాలు తగ్గుతాయని నమ్ముతారు చాలామంది. ఇది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు. మామిడి పండులోని యాంటీ న్యూట్రీషియన్ ఫైటో యాసిడ్​ని తొలగించేందుకు ఏ పద్ధతీ లేదనీ, నిజానికి ఇది అన్ని పండ్లల్లోనూ ఉంటుందని చెబుతున్నారు. అయితే శరీరంలో వేడి, మామిడి పండ్లు తినడం వల్ల అలర్జీలు కలిగే వాళ్లు వీటికి దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు. నిజానికి మామిడి పండ్లు జీర్ణవ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపించవనీ, వాటిని సాధారణంగా తీసుకోవడమే శరీరానికి మంచిదని అంటున్నారు. రోడ్లపై కొనే పండ్లపై ఉండే దుమ్ము, ధూళి కణాలను తొలగించేందుకు కడగొచ్చు కానీ , దానిలోని యాంటీ న్యూట్రీషియన్ ఫైటో యాసిడ్ తగ్గించేందుకు నానబెట్టడం అర్థం లేని పని అని చెబుతున్నారు.