Health: ఆరోగ్యానికి ఓ కౌగిలింత!

Hyderabad: మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను ఒక్క కౌగిలింత(Hug)తో చెప్పేయవచ్చు. కౌగిలింత ప్రేమ, ఆత్మీయతను సూచిస్తుంది. ఒక కౌగిలింత ఎన్నో అర్థాలను సూచిస్తుంది. అంతేకాదు, ఒకరికి కౌగిలింత ఇవ్వడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు(Health) కూడా ఉంటాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. బాధ, విచారణలో ఉన్నపుడు ఇచ్చే కౌగిలింతతో గొప్ప ఊరట, ఉపశమనం లభిస్తుంది, ప్రేమతో ఇచ్చే కౌగిలింతతో సాన్నిహిత్యం పెరుగుతుంది బంధాలు బలపడతాయి. ప్రేమ, భయం, బాధ, విచారం ఇలా ఎలాంటి భావోద్వేగాన్ని వ్యక్తపరచటానికైనా కౌగిలింత అనేది ఒక గొప్ప భావవ్యక్తీకరణగా పనిచేస్తుంది.

త‌ర‌చూ హ‌గ్ తీసుకుంటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంద‌ని మాన‌సిక వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాదు, ఇది ఒత్తిడిని త‌గ్గించే కార్టిసాల్ హార్మోన్‌ను నియంత్రిస్తుంద‌ట‌. హ‌గ్ చేసుకుంటే భ‌యం తొలగిపోయి, ఆత్మ‌విశ్వాసం పెరుగుతుంది. దీని వ‌ల్ల ఆక్సిటోసిన్(Oxytocin) అనే హార్మోన్ విడుద‌లై డిప్రెష‌న్ దూర‌మ‌వుతుంది.

ఆనందం కలిగినపుడు శరీరంలో ఆక్సిటోసిన్ అనే రసాయనం విడుదలవుతుంది. ఈ రసాయనం మనలోని ఒత్తిడి, బాధలను ఒక్కసారిగా తీసివేసి మనల్ని ఆనందంలో ముంచెత్తుతుంది, సంతషంగా ఉంచుతుంది. మహిళలు తమ శిశువులను దగ్గరకు తీసుకున్నప్పుడు, ఇష్టమైన వ్యక్తిని కౌగిలించుకున్నప్పుడు వారిలో ఆక్సిటోసిన్ విడుదలవుతున్నట్లు పరిశోధకులు గమనించారు. ఒక అధ్యయనం ప్రకారం ఒక వ్యక్తి రోజుకు 8 నుంచి 12 సార్లు తమకు ఇష్టమైన వ్యక్తిని కౌగిలించుకుంటే శారీరకంగానూ, మానసికంగానూ అనేక ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు.