Healthy Drinks: పిల్లల కడుపు చల్లగా..!
Hyderabad: ఈసారి ఎండల తీవ్రత (summer) ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న 3, 4 రోజులు ఎండలు ఠారెత్తించేలా ఉన్నాయి. ఉదయం 9 గంటలకే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఎక్కువగా బయట ఆడుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఎండ వేడి వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి సమయంలో పిల్లల జీర్ణవ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి వారి కడుపు చల్లగా ఉండేలా కొన్ని హెల్తీ డ్రింక్స్ (healthy drinks) ఉన్నాయి. అవేంటో చూద్దాం.
ఎండకాల తీవ్రత (summer heat) తగ్గేవరకు పిల్లలకు వీలైనంత ఎక్కువగా కొబ్బరి నీళ్లు ఇస్తూ ఉండండి. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ పిల్లలకు, పెద్దలకు కూడా మంచిదే. ఇందులో బోలెడన్ని మినరల్స్ ఉంటాయి. కాబట్టి తాగిన వెంటనే తక్షిణ శక్తి లభిస్తుంది.
సత్తు డ్రింక్.. అంటే ముడిశెనగలను వేయించిన తర్వాత వాటిని గ్రైండ్ చేసి జ్యూస్‌లా చేసుకుంటారు. దానినే సత్తు డ్రింక్ అంటారు. ఈ సత్తు డ్రింక్‌లో బోలెడన్ని కూలింగ్ ప్రాపర్టీలు ఉంటాయి. ఇందులో ప్రొటీన్ కూడా ఎక్కువే. పిల్లలకు దీని రుచి అంతగా నచ్చకపోవచ్చు కాస్త నిమ్మకాయి, బెల్లం పొడి, ఖర్జూరం ముక్కులు వేసి ఇవ్వండి.
వేసవి అంటే ఠక్కున గుర్తొచ్చేది పుచ్చకాయ. ఇప్పుడు ఇంకా విరివిగా దొరుకుతాయి కాబట్టి రోజుకి మూడు, నాలుగు గ్లాసులు పిల్లలకు ఇవ్వండి. తక్షిణ శక్తి వస్తుంది. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్ సమయంలో సాయంత్రం స్నాక్ సమయంలో తాగిస్తుండండి.
కాలంతో సంబంధం లేకుండా ఇంట్లోనే సులువుగా చేసుకునే డ్రింక్స్‌లో లెమనేడ్ ఒకటి. రోజూ ఉదయాన్నే గ్లాసుడు నీటిలో ఒక నిమ్మకాయ పిండి అందులో కాస్త బెల్లం పొడి లేదా నేచురల్ తేనె కలిపి తాగించండి. ఈ సమ్మర్ డ్రింక్‌కి సాటిగా మరే డ్రింక్ లేదు అనడంలో సందేహం లేదు. వీటితో పాటు రోజూ పల్చటి మజ్జిగ కూడా తాగిస్తే పిల్లల ఆరోగ్యానికి ఎంతో మంచిది.