ఉదయాన్నే టీ తాగుతున్నారా.. జాగ్రత్త!

నిద్ర లెవ్వగానే పొగలు కక్కే టీ, కాఫీలతో రోజుని ప్రారంభించడం చాలామందికి అలవాటు. కొందరికి పొద్దుపొద్దున్నే టీ కడుపులో పడకపోతే అసలు ఏ పనీ తోచదు. అయితే టీ, బిస్కెట్లతో రోజుని ప్రారంభిస్తే ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. పరగడపున టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంతోపాటు ఎసిడిటీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. అంతేకాదు బిస్కెట్లలోని గ్లూటేన్​ కూడా జీర్ణక్రియపై ప్రభావం చూపి మెటబాలిజాన్ని దెబ్బతీస్తుంది. టీ, కాఫీలకు బదులుగా ఉదయాన్నే తీసుకునేందుకు  ప్రముఖ డైటీషియన్​ మన్​ప్రీత్​ సూచిస్తున్న ప్రత్యామ్నాయాలు ఏంటో చూద్దాం..

కొత్తిమీర వాటర్

కడుపు ఉబ్బరం సమస్యను తగ్గించేందుకు కొత్తిమీర నీరు బాగా పని చేస్తుంది. ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్​ కొత్తిమీర పొడి కలిపి తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపరిచే జీర్ణ ఎంజైమ్​లను ప్రేరేపిస్తుంది. అంతేకాదు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

కలబంద రసం

అజీర్ణం, మలబద్ధకం సమస్యలకు కలబంద రసం చక్కగా పని చేస్తుంది.  ఒక గ్లాసు నీటిలో 15 మి.లీ కలబంద రసం కలిపి తీసుకుంటే జీర్ణక్రియను మెరుగు పరచడమే కాకుండా శరీరంలోని టాక్సిన్లను కూడా బయటకు పంపిస్తుంది.

ఆలివ్​ గింజలతో కొబ్బరి నీరు

ఆలివ్​ గింజలనే హలీమ్​ గింజలు అని కూడా అంటారు. ఇవి కేశాల ఎదుగుదలను మెరుగుపరచడంలో బాగా పని చేస్తాయి. ఉదయాన్నే హలీమ్ గింజలు కలిపిన కొబ్బరి నీళ్లను తాగితే మంచి ఫలితం ఉంటుంది. రెండు గంటలపాటు నానబెట్టిన 1/4 టీస్పూన్ హలీమ్ గింజలను కొబ్బరి నీటిలో కలుపుకుని తాగాలి.  వీటిలో పుష్కలంగా ఉండే ఐరన్ జుట్టు పెరుగుదలను మెరుగుపరచడంతోపాటు స్కాల్ప్ పై హెయిర్ ఫోలికల్స్ స్టిమ్యులేట్ చేయడం ద్వారా చిట్లిపోకుండా చేస్తుంది.

దాల్చినచెక్కతో కొబ్బరి నీరు

రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.  ఒక గ్లాసు కొబ్బరి నీళ్లలో చిటికెడు దాల్చినచెక్క పొడి కలిపి తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతోపాటు  లెప్టిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.

సోంపు నీరు

సోంపు నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది గౌట్​ సమస్యను తగ్గించడంలో సాయపడుతుంది. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి, జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ సోంపు గింజల పొడిని వేసి తాగితే మంచి ఫలితం ఉంటుంది.